పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దావీదు ప్రభువుకి మందిరాన్ని కట్టాలని కోరుకొన్నాడు కదా! ఈ కోరికకు దేవుడు ఎంతో సంతోషించాడు. దావీదు తనకు దేవాలయం కట్టకపోయినా కట్టినట్లే భావించాడు. కనుక అతడు దావీదుని బహూకరింపగోరాడు. ఆ బహుమానమేమిటంటే, దేవుడు దావీదుకి ఓ మందిరాన్ని కట్టిపెడతాడు. ఆ మందిరం దావీదు రాజవంశమే. దావీదు వంశంలో పుట్టినవాళ్ళ ఎడతెగకుండా యెరూషలేములో పరిపాలనం చేస్తారు. అతని రాజవంశం కలకాలం కొనసాగుతుంది. కడన ఆ రాజవంశంనుండే మెస్సీయా పుడతాడు. ఆ ప్రభువు రాజ్యానికి అంతమే వుండదు. ఆ క్రీస్తుద్వారా దావీదు రాజవంశం శాశ్వతంగా నిలిపోతుంది.

దావీదుకి బదులుగా అతని కుమారుడు సొలోమోను దేవాలయం కడతాడు. దావీదే ఎందుకు మందిరాన్ని కట్టగూడదంటే, అతడు చాల జాతులతో యుద్ధాలుచేసి రక్తాన్ని అపారంగా ఒలికించాడు. అతని చేతులు మలినమయ్యాయి. అలాంటి మలిన హస్తాలతో అతడు దేవునికి మందిరాన్ని కట్టగూడదు. ఆ పని సొలోమోను చేస్తాడు. - 1రాజుల దినచర్య 22,6-10.

ప్రభువు ఈ సొలోమోనుని కుమారునిలాగ ఆదరిస్తాడు. సౌలులాగాక సొలోమోను దేవుని మన్ననను పొందుతాడు. ఇది నాతాను దావీదుకి చెప్పిన ప్రవచనం. ఈ ప్రవచనం ప్రకారం మెస్సీయా దావీదు వంశంలో జన్మిస్తాడు. అతడు రాజుగా అవతరిస్తాడు.

పూర్వం సీనాయి కొండదగ్గర ప్రభువు యిస్రాయేలీయులందరితోను నిబంధనం చేసికొన్నాడు. తాను వారిని కాచి కాపాడతానని బాసచేసాడు. ఐతే దావీదు కాలంనుండి ఈ సీనాయి నిబంధనం దావీదు కుటుంబానికి పరిమితమై పోయింది. అనగా యికమీదట దావీదు కుటుంబంద్వారా, ఆ కుటుంబంలో జన్మించే మెస్సీయా ద్వారా, ప్రభువు యిప్రాయేలీయులను ఉద్ధరిస్తాడు. ఈ ప్రవచనంతో మొదలుపెట్టి ప్రవక్తలు 500ఏండ్లపాటు మెస్సీయా దావీదు కుటుంబంలోనే జన్మిస్తాడని ప్రవచనాలు చెపూవచ్చారు. వాళ్ళ చెప్పినట్లే తర్వాత వెయ్యేండ్లకు క్రీస్తు దావీదు కుమారుడుగా బెత్లెహేములో జన్మించాడు.

నాతాను ప్రవచనం దావీదుకి పరమానందం కలిగించింది. తన రాజవంశం శాశ్వతంగా కొనసాగడం, తన కుమారుడు సొలోమోను యెరూషలేములో దేవాలయం కట్టడం సామాన్య భాగ్యాలా! అతడు దైవమందసాన్ని పెట్టివుంచిన గుడారంలోనికి వెళ్ళి ప్రభువుకి కృతజ్ఞతావందనాలు చెల్లించాడు. ప్రభూ! నీవు నన్నింతగా పట్టించుకోడానికి నేనేపాటివాణ్ణి? మా కుటుంబమేపాటిది? నీవు నన్నింతగా ఆదరించి పెద్దజేయాలా? అని వ్యక్తిగతంగా వందనాలు అర్పించాడు.
ప్రభువు యిస్రాయేలు సమాజానికంతటికీ గూడ వుపకారాలు చేసాడు. అతడు ఐగుపులో ఆ ప్రజల కొరకు ఎన్నో అద్భుతాలు చేసాడు. వారిని ఫరో బానిసంనుండి