పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సౌలు యద్ధంలో అమాలెకీయులను ఓడించి చంపివేసాడు. కాని వారి రాజైన అగాగును మాత్రం చంపలేదు. తన విజయచిహ్నంగా అతన్ని బ్రతికి వుండనిచ్చాడు. ఇంకా సౌలు అనుచరులు అమాలెకీయుల బక్కగొడ్లనుచంపి పేసి బలిసినవాటిని మిగుల్చుకొన్నారు. కనుక సౌలు అతని సైనికులు అమాలెకీయులను శాపంపాలు చేయాలి అన్నయావే ఆజ్ఞను ఖండితంగా పాటించలేదు. తమకు లాభంగా వున్నంతవరకు శత్రువుల పశువులను దక్కించుకొన్నారు.

కావున ప్రభువు సమూవేలుకి ఫిర్యాదు చేసాడు. సాలు నా యాజ్ఞలను ధిక్కరించాడు. నేనతన్ని రాజుని చేసినందులకు విచారిస్తున్నాను అన్నాడు. సౌలుని క్షమించమని సమూవేలు రాత్రంతా ప్రభువుకి మొరపెట్టాడు. కాని ప్రభువు అతని వేడికోలు ఆలించలేదు.

సమూవేలు సౌలుని చూడబోయి గిల్లాలు పుణ్యక్షేత్రంలో అతన్నికలసికొన్నాడు. సౌలు నేను యావే ఆజ్ఞ పాటించి అమాలెకీయులను నాశంచేసానని డంబాలు పల్మాడు. కాని ప్రవక్త అతన్ని నిలదీసి మీరు శత్రువుల పశువులనుండి బలసిన యెడ్లను గొర్రెలను దక్కించుకొన్నారు. మరి ప్రభువు ఆజ్ఞను పాటించిందెక్కడ అని ప్రశ్నించాడు. కాని రాజు మేము వీటిని ప్రభువుకి బలి యిూయడానికే అట్టిపెట్టుకొన్నామని బూకరించాడు.

ఆ మాటలకు సమూవేలు కోపం తెచ్చుకొని రాజుతో “వట్టి బలులవలన యావేకు ప్రీతి కలుగుతుందా? విధేయత వలన కాదా? బలులకంటె విధేయత గొప్పదికాదా? గర్వంతో దేవునిమీద తిరుగుబాటుచేస్తే సోదె చెప్పించుకొన్నంత పాపం. విగ్రహాలను పూజించినంత నేరం. నీవు యావే ఆజ్ఞను త్రోసిపుచ్చావు కనుక ప్రభువు నీ రాజపదవిని త్రోసివేసాడు" అని పల్మాడు.

ప్రవక్త చెప్పినట్లు, బలికంటె విధేయత గొప్పది. ఎందుకంటె బలి వట్టి బాహ్యక్రియ. హృదయంలో భక్తి లేకున్నా దాన్ని సమర్పించవచ్చు. కాని హృదయంలో భక్తిలేందే విధేయత చూపలేం. కనుక సౌలు బలి అర్పించడానికి పూనుకోవడంకంటె దేవునిపట్ల విధేయత చూపడం లెస్స.

అసలు దేవుడు సౌలుని బలి సమర్పించమని కోరనే లేదు. అమాలెకీయులను శాపంపాలు చేయమన్నాడు అంతే. సౌలు ఈ యాజ్ఞను మీరాడు, అతడు దేవుణ్ణి తనకిష్టమెచ్చిన పద్ధతిలో పూజించవచ్చుననుకొన్నాడు. అనుచరుల మన్ననను సంపాదింపగోరి వారిని తమ యిష్టం వచ్చినట్లు చేయనిచ్చాడు. అది అతని తప్ప.

సౌలు దేవుని ఆజ్ఞమీరి అతని మీద తిరుగుబాటు చేసాడు. తన్ను పైకి తీసికొనివచ్చిన దేవునిపట్ల గర్వాన్ని ప్రదర్శించాడు. ఈ యహంకారం విగ్రహాలను పూజించినంత పాపం. సోదె చెప్పించుకొన్నంత నేరం.