పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎప్పుడు కూడ పాపపు మూకకు దేవుడు మొదట శిక్షాప్రవచనాలు విన్పిస్తాడు. ఆ మీదట రక్షణ ప్రవచనాలు విన్పిస్తాడు. ఏలీ జీవితంలో ఈలాగే జరిగింది. నేడు మన జీవితంలోను ఈలాగే జరుగుతుంది. కనుక మొట్టమొదట మనం దేవుని యెదుట మన పాపాలకు పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపానంతరంగాని అతని రక్షణను పొందలేం.

2. దేవుడు సమూవేలుని పిల్చిన తీరుగూడ మననం జేసికోదగ్గది. అతడు పూర్వం తన భక్తులను నేరుగా పిల్చాడు. సమూవేలు యెషయా యిర్మియా పౌలు మరియు మొదలైనవాళ్ళను దర్శనాల ద్వారా ప్రత్యేకంగా పిల్చాడు. కాని నేడు మన పిలుపు ప్రత్యక్షంగా గాక పరోక్షంగా వుంటుంది. అనగా మన హృదయంలో ఓ విధమైన కోరిక పుట్టించి ఆ కోరికద్వారా దేవుడు మనలను తన సేవకు పిలుస్తాడు. ఈ పిలుపుకొందరి విషయంలో ఐతే, గురు కన్యాజీవితాలు గడపడానికి. మరికొందరి విషయంలో ఐతే, భక్తిగల సంసారజీవితం గడపడానికి. ఐనా ఈ రెండూ దైవపిలుపులే. ఈ రెండురకాల పిలుపుల్లోను మనకు దైవదర్శనాలు కలగవు. హృదయంలో పుట్టే కోరికలు చాలు. ఆ సమూవేలులాగే మనంకూడ నేడు మన జీవితంలో దేవుని పిలుపుని ఆలించాలని వేడుకొందాం.

3. సమూవేలు రాత్రి గర్భాగారంలో దైవమందసం వద్ద పండుకొని వుండగా అతనికి దేవుని స్వరం విన్పించింది. దైవమందసం దైవసాన్నిధ్యం. దైవోక్తులు విన్పించే తావు. సమూవేలు పవిత్రమైన వాతావరణంలో వున్నప్పడు అతనికి దేవుని పల్కులు విన్పించాయి. నేడు మనకుగూడ దేవుడు తన సందేశాన్ని విన్పిస్తాడు. అతడు మన అంతరాత్మలో మాటలాడతాడు. కాని అతని స్వరాన్ని వినాలి అంటే మన తరపున మనం పవిత్రమైన వాతావరణంలో వుండాలి. బైబులు పఠించాలి. ప్రార్ధన చేసికోవాలి. దేవళానికి వెళ్ళి దేవుణ్ణి పూజించుకోవాలి. దేవద్రవ్యానుమానాలను స్వీకరించాలి. సోదరప్రేమతో సేవాభావంతో జీవించాలి. ఈలా దేవునితో పరిచయం కలిగించుకొని పవిత్ర వాతావారణంతో జీవిస్తుంటే మనకు దైవస్వరం విన్పిస్తుంది. కేవలం లౌకిక జీవితము గడిపేవాళ్ళకు దేవుని స్వరం విన్పించదు. దేవునివల్ల ప్రభావితులం కావాలి అంటే మొదట మనకు అతనిమీద భక్తి కుదరాలి.

4. సమూవేలు దైవసందేశాన్ని విన్పింపగా యేలీ ఆయన చేయదలుచుకొన్న కార్యం చేయునుగాక అన్నాడు. అతడు తన కుటుంబం నాశంగావడానికి సమ్మతించాడు. దేవునిమీద సుమ్మర్లు పడలేదు. దేవుని చిత్తాన్ని గుర్తించి ఆ చిత్తప్రకారం జీవించడం యూదుల ముఖ్యభక్తి. మనంకూడ ఈ భక్తిని అలవర్చుకోవాలి, మన చిత్తప్రకారం మనం జీవించక దేవుని చిత్తప్రకారం జీవించడం అలవాటు చేసికోవాలి. జీవితంలో ఆయా ముఖ్య నిర్ణయాలు చేసికొనేపుడు దేవుణ్ణి సంప్రతించి చూడాలి.