పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జట్టు పోవడంతోనే సంసోనికి వ్రతభంగమైంది. దానితో స్వీయశక్తికూడ నశింపగా అతడు దుర్బలుడయ్యాడు. ఫిలిస్ట్రీయులు అతనిని బందీనిచేసి కండ్లు పెరికివేసి గాసాకు కొనిపోయి చెరలో వేసారు. గానుగ మానుకి కట్టివేసి అతనిచే ఆమాను తిప్పించారు. ఈ పని గాడిదో యెదో చేస్తుంది. అనగా సంసోను పశువులాంటివాడైపోయాడని భావం. ఈ విధంగా అతడు స్త్రీలోలత్వం వలన తన జటూ, బలమూ, కండల్లా, స్వేచ్చా వ్రతమూ అన్నీ కోల్పోయాడు. ఎంతటి వీరునికి ఎంత దుర్గతి! నరులు ఎంతటి వున్నత స్థాయిలో వుంటారో వారి పతనం గూడ అంత తీవ్రంగా వుంటుంది.

ఫిలిస్టీయుల దేవుడు డాగోను, వాళ్ళు ఆ దాగోనే సంసోనుని తమచేతికి పట్టియిచ్చాడనుకొని పొంగిపోయారు. కృతజ్ఞతాపూర్వకంగా డాగోను దేవళంలో ఉత్సవం జరపబూనారు. ఆ పండుగలో వాళ్ళు సంసోనుని వీరకార్యాలు చేసిచూపించమన్నారు. అతడు బందీగావుండే, బంధింపబడిన యెలుగుబంటిలాగ వాళ్ళముందు వీరకార్యాలు చేసాడు. ఆ తమాషా చూచి ఫిలుస్టీయులు ఆనందించారు.

డాగోను దేవళం రెండు పెద్ద స్తంభాలమీద నిల్చివుంది. మీది అంతస్తులో మూడువేలమంది ఫిలిస్టీయులు కూర్చుండి సంబరం జూస్తున్నారు. సంసోను క్రింద రెండు స్తంభాలమధ్య నిలచివున్నాడు. అతడు తనకు జరుగుతూన్న అవమానాన్ని భరించలేకపోయాడు. తన దుర్గతికి తానే కారకుడనని గ్రహించాడు. తన తప్పకి పశ్చాత్తాపపడ్డాడు. తన పాపాన్ని మన్నించమని ప్రభువుని వేడుకొన్నాడు. ఫిలిస్టీయులను నాశం జేయడం అతని బాధ్యత. డాగోను దేవళాన్ని కూలద్రోస్తే వాళ్లు పెద్ద పెట్టున చస్తారు. అప్పడు అతని బాధ్యత తీరుతుంది. కనుక అతడు ప్రభువుకి మనవి చేసాడు. నా తప్పిదాన్ని మన్నించి నాకు మళ్ళాపూర్వబలాన్ని ఒక్కసారి దయచేయమని వేడుకొన్నాడు. దేవుడు అతని వేడికోలు ఆలించాడు.

చెరలో వున్నప్పటినుండి సంసోను జట్టు మళ్ళా పెరుగుతూ వచ్చింది. అనగా అతని పూర్వబలం తిరిగి రాజొచ్చింది. ఈలా దైవాశీర్వాదంతో బలాఢ్యుడైన సంసోను రెండు స్తంభాలమీద రెండు చేతులుమోపి వాటిని బలంగా ముందుకి త్రోసాడు. ఆ త్రోపుకి దేవళం పెళ్ళన కూలి నేలపైబడింది. పైనున్నవాళూ క్రిందివాళూ అందరూ చచ్చారు. ఈ విధంగా శత్రువులమీద పగతీర్చుకొని సంసోనుకూడ మరణించాడు.

ఈ సందర్భంలో బైబులు "సంసోను బ్రతికివుండగా చంపినవారికంటె చనిపోతూ చంపినవారే అధికులు" అని చెప్పంది – 16,30. ఫిలిస్టీయులనుండి యిస్రాయేలీయులను కాపాడ్డానికే ప్రభువు సంసోనును ఎన్నుకొన్నాడు. కనుక వాళ్ళను నాశం చేయడం అతని పూచీ, ఈ కార్యాన్ని అతడు చనిపోతూ అధికంగా సాధించాడు. అతనిది వీరమరణం. శత్రువులను నాశంచేయడానికి అతడు స్వీయప్రాణాలనే అర్పించాడు. ఆ రీతిగా అతడు

                                                           146