పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవదూత "నీవు గర్భం ధరించి బిడ్డను కంటావు" అని చెప్పగానే మరియ "నేను పురుషుని యెరుగను గదా, ఇదెలా జరుగుతుంది?? అని అడుగుతుంది -లూకా 1,34. దేవదూత "నీవు పురుషుని వలనగాక పరిశుద్దాత్మ శక్తివలన గర్భవతి వౌతావు" అని చెప్తాడు. మరియు తన అంగీకారాన్ని సూచిస్తూ "ఇదిగో ప్రభువు దాసురాలను. నీమాట చొప్పననే నాకు జరగాలి” అంటుంది. ఆ విధంగా ఆమె తన కన్యాత్వానికి భంగం కలుగకుండానే బిడ్డను కంది.

అంతకు ఎన్మిదివందల ఏండ్లకు పూర్వమే ప్రవక్త యెషయా "కన్య గర్భవతియై బిడ్డను కంటుంది, ఆ బిడ్డకు ఇమ్మానువేలు అని పేరు పెడతారు" అని ప్రవచనం చెప్పాడు. 7,14. చారిత్రకంగా యీ ప్రవచనం ఆహాసు రాజు భార్య కనిన హిజ్కియా ప్రభువునకు వర్తించినా, ప్రవక్తకుకూడ తెలియరాని పరిపూర్ణార్ధం వలన కన్యమరియకు కూడ వర్తిస్తుంది. అందుకే సువిశేషకారుడు మత్తయి ఈ ప్రవచనాన్ని మరియ పరంగా ఉదాహరించాడు - 1,23.

పై బైబులు సందర్భాలు రెండూ మరియ బిడ్డను కనకముందు కన్యగా వుందని సూచిస్తాయి. కాని బిడ్డను కన్న తరువాత? ఆమె బిడ్డను కన్న తరువాతకూడ కన్యగా వుండిపోయిందని బైబులు ఎక్కడా చెప్పదు. కాని అలా వండిపోలేదని కూడ ఎక్కడా చెప్పదు. సువార్తల్లో పలుతావుల్లో "క్రీస్తు సోదరులు" అనేమాట విన్పిస్తుంది. కాని హీబ్రూభాషా మర్యాద తెలిసినవాళ్లు ఈ "సోదరులు" క్రీస్తు సొంత తముళ్ళు కాదనీ పినతల్లి పెత్తల్లి లేక చిన్నాయన పెదనాయన బిడ్డలని వెంటనే గ్రహిస్తారు. అలాగే “మరియ తొలిచూలు బిడ్డను కంది" అనే ప్రయోగంగూడ ఆమెకు మలిచూలు బిడ్డలున్నారని నిరూపింపదు - లూకా 2,7. "కుమారుని కనేవరకు యేసేపనకు ఆమెతో శారీరక సంబంధంలేదు" అనే మత్తయి 1,25 వచనంకూడ, క్రీస్తు తరువాత మరియమాతకు మళ్ళీ పిల్లలు పుట్టారని రుజువు చేయదు. బైబులు స్పష్టంగా చెప్పదుగాని పారంపర్యంగా వచ్చిన క్రైస్తవ సంప్రదాయం మాత్రం మరియ బిడ్డను కన్న తరువాతగూడ కన్యగానే వుండిపోయిందని చెప్తుంది. అందుకే ఆమెను "నిత్యకన్య" అంటాం.

2. ఆత్మశక్తి

దూత మరియతో "పవిత్రాత్మనీ మీదికి దిగివస్తుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అంచేత నీకు జన్మింపబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడౌతాడు" అంటాడు -లూకా 1,35. కనుక మరియ పవిత్రాత్మ శక్తి వలన గర్భవతి ఐంది. కాని యిక్కడ పరిశుద్ధాత్మ చేసిందేమిటి? ఆ యాత్మడు పిత సుతుడు అనే దైవవ్యక్తులను • ఐక్యపరుస్తుంటాడు. నరునీ దేవునితో జోడిస్తుంటాడు. కనుక ఆ యాత్మడు ఐక్యతా