పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ ప్రాచీన కాలానికి చెందిన అబ్రాహాము తన ఏకైక కుమారుణీ ఏలా త్యాగం చేయగలడు? ముసలివాడు ఊతకర్రమీద ఆధారపడి నడచినట్లుగా అబ్రాహాము ఈసాకు మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ముసలివాని చేతిలోనుండి ఊతకర్రను లాగివేస్తే అతడు ఏమౌతాడు?

ఈ విధంగా ఈసాకుని బలియిూయడం అబ్రాహాముకి అన్ని విధాల కష్టమైంది. కనుక అతని దుఃఖమూ మానసిక వేదనా అంతాయింతా కాదు. ప్రభువు ఆజ్ఞ అతని విశ్వాసానికి నిజంగా పరీక్ష.

మనమైతే అమ్మో యెంత దొంగదేవుడు! బిడ్డట్టి యిచ్చినట్లేయిచ్చి మళ్ళా తీసికొనిపోతాడా అని భగవంతుణ్ణి తిట్టేవాళ్ళమే. కాని అబ్రాహాము మహా భక్తుడు. ప్రభువుని పూర్ణహృదయంతో ప్రేమించిన మహానుభావుడు. ప్రభువు ఆజ్ఞ రాత్రి కలలో విన్పించింది కదా! ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. సత్వరమే దేవుని ఉత్తరువుని పాటించాలి. కనుక అతడు తెల్లవారకముందే లేచాడు. గాడిదను ప్రయాణానికి సిద్ధంజేసాడు. దహనబలికి కట్టెలు చీల్చి మోపు కట్టాడు. కుమారుడ్డీ ఇద్దరు సేవకులనూ తీసికొని మోరీయా కొండకు బయలుదేరాడు. మూడురోజులు ప్రయాణంచేసి ఆ కొండను చేరాడు. సేవకులను కొండ క్రిందనే ఉండమని చెప్పి కుమారునితో తాను కొండ ఎక్కడం ప్రారంభించాడు.
ఈసాకు కట్టెలమోపు మోసికొని కొండ యొక్కుతూన్నాడు. అతడు భావికాలంలో ఇంకో కట్టెలమోపు మోసికొనిపోయే క్రీస్తుకి చిహ్నంగా వుంటాడు. అబ్రాహాము నిప్పూ కత్తీ తీసికొని పోతూన్నాడు.
ఈలా తండ్రీ కొడుకులు కొండ యొక్కుతూండగా ఈసాకు నాన్నా! నిప్పూ కత్తీ వున్నాయి. అసలు దహనబలికి గొర్రెపిల్ల యేదీ అని అడిగాడు. ఆ ప్రశ్న బయటికి అమాయకంగా కన్పిస్తుంది. కాని ఆ పసివాడి ప్రశ్నవల్ల అబ్రాహాము గుండె తరుగుకొనిపోయింది, అతడు నాయనా నీవే బలిపశువాతావరా అని ఈసాకుతో చెప్పాలి. కాని యేతండ్రి తన కుమారునితో అలా చెప్పగలడు? ఏ తండ్రి తన సొంత చేతులతోనే కుమారుని బలియిూయగలడు? కనుక అబ్రాహాము తన దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకొని నాయనా దహనబలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూరుస్తాడు అని బదులు చెప్పాడు.
అంతలో తండ్రీ కొడుకులు కొండశిఖరాన్ని చేరుకొన్నారు. అక్కడ అబ్రాహాము రాళ్ళతో బలి వేదికను నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. కుమారుని బంధించి కట్టెలపైనుంచి చంపడానికి కత్తిదూసాడు. ఇప్పడు ఈ కథ చదువుతూన్న మనకు ఈసాకు ఎటూ చనిపోడని తెలుసు. కాని అబ్రాహాముకి ఈ సంగతి తెలియదు. అతడు కుమారుడు బలిఔతాడన్న భావంతోనే అతన్ని చంపడానికి కత్తి యెత్తాడు. అతడు తన ప్రాణంకంటెగూడ ఈసాకుని అధికంగా ప్రేమించాడు. కాని,ఈసాకుకంటెగూడ దేవుణ్ణి అధికంగా ప్రేమించాడు. కనుక దేవుని ఆజ్ఞను పాటించి ఈసాకుని బలియిూయడానికి వెనుకాడలేదు.
                                                          141