పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాళ్ళు మంత్రవిద్యకూ అపవిత్రారాధనకూ పాల్పడ్డారు
క్రూరబుద్ధితో తమ శిశువులనే చంపారు
ఉత్సవాల్లో నరమాంసం నరరుధిరం ఆరగించారు
రహస్యారాధనలు జరపడానికి ఉపదేశం పొంది
ఆ యారాధనల్లో తమ బిడ్డలనే బలియిచ్చారు
నీవు మా పితరుల ద్వారా వారిని నాశం చేయించావు. - సాలో జ్ఞాన 12, 3-6.

40. పాపంచేయకూడదు

నరులు బాల్యంనుండి చెడ్డవైపునకే మొగ్గుతుంటారు. కడన దేవుని తీర్పునకు గురై శిక్షను అనుభవిస్తారు. ఐనా మనం ఓ దినం చనిపోతామని ఎల్లవేళలా గుర్తుంచుకొంటే పాపం చేయడానికి జంకుతాం. సజ్జనుడు పామునుండివలె పాపంనుండి దూరంగా పారిపోవాలి. పాపం కోరలు సింహం కోరల్లాగ ప్రాణాలు తీస్తాయి.

నరులు బాల్యంనుండి చెడ్డవైపునకే మొగ్గుతారు
వాళ్లు తమ దుష్టహృదయాన్ని మార్చుకోరు
ప్రభువు కడన తీర్పుచెప్పి దుషులను శిక్షిస్తాడు
వారు తమ పాపాలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు
ఓ దినం నీవు మరణించి తీరుతావని
నీవు చేసే కార్యాలన్నిటిలోను గుర్తుంచుకో
అప్పడు నీవు ఎన్నడూ పాపం కట్టుకోవు
కుమారా! నీవీవరకే పాపం చేసివుంటే మళ్ళా చేయవద్దు
పూర్వం చేసిన తప్పులను మన్నించమని దేవుణ్ణి వేడుకో
సర్పంనుండిలాగ పాపంనుండి దూరంగా పారిపో
దాని దగ్గరికి పోయావంటే అది నిన్ను కాటువేస్తుంది
పాపం కోరలు సింహం కోరల్లాంటివి
అవి నరుల ప్రాణాలు తీస్తాయి
రెండంచుల కత్తి నయంగాని గాయాన్ని చేస్తుంది
దైవాజ్ఞమీరి చేసిన పాపంకూడ ఈలాగే చేస్తుంది. - సీరా 17, 16, 23. 7,36. 21, 1-3.