పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేన్నయినా తీసికోండి. అది మనం పట్టక పూర్వం నుండి వున్నదేనని తెలుస్తుంది. ఆలాగే ఇక జరిగేవాటిని గూడ భావితరాలవారు గుర్తుంచుకోరు - ఉప 1,8-12.

కొన్ని యేండ్లయిన తర్వాత నరునికి వార్ధక్యం వస్తుంది. అపుడు
ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వణకుతాయి
ఇంతవరకు బలంగావున్న నీ కాళ్లు కూలబడతాయి
నీ పండ్లు రాలిపోతాయి
నీ కండ్ల వెల్లుర్ని సరిగా చూడలేవు
నీ చెవులు వీధిలో శబ్దాలను సరిగా వినలేవు
తిరుగటిరాయి చేసే శబ్దాలను వినలేవు
సంగీతాన్నీ పక్షుల కూతలను గ్రహించలేవు
అప్పడు నీవు మెరకను ఎక్కలేవు
అటూయిటూ కదలడంగూడ ప్రమాదకరమే
నీ వెండ్రుకలు నరసి తెల్లనౌతాయి
నీవు కష్టంతోగాని అటూయిటూ కదల్లేవు
నీ యెదలోని కోర్కెలన్నీ సమసిపోతాయి.

అపుడు నరుడు తన శాశ్వత నివాసానికి వెడలిపోతాడు. అతని కొరకు శోకించేవారు వీధిలో అటూయిటూ తిరుగుతారు.

అపుడు వెండి గొలుసు తెగిపోతుంది
బంగారు దీపం క్రిందపడి పగిలిపోతుంది
బావిమీది గిలక విరిగిపోతుంది
నీటికుండ జారిపడి ముక్కలైపోతుంది
నరుని దేహం ఏ మట్టినుండి వచ్చిందో ఆ మట్టిలోనికి తిరిగి పోతుంది. అతని ప్రాణం మొదట దాన్ని దయచేసిన దేవుణ్ణి చేరుకొంటుంది. కనుక అంతా వ్యర్ధమే. సర్వం వ్యర్ధమేనని ఉపదేశకుడు వాకొంటున్నాడు - ఉప 12, 3–7.
ఏ శక్తి మనలను మృత్యువునుండి కాపాడలేదు. మనమంతా జనులు చంపడానికి తోలుకొనిపోయే మృగాల్లా చావవలసిందే.
నరుని వైభవాలు అతని ప్రాణాలను కాపాడలేవు
అతడు వధకు గురియైన మృగంలా చావవలసిందే
మృత్యువే నరులకు కాపరియై
వారిని గొర్రెలనువలె పాతాళలోకానికి
తోలుకొనిపోతుంది - కీర్త 49, 12-14.