పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31.కుటుంబవిషయాల్లో ఆమెతో కలసి వో నిర్ణయానికి వస్తుంటానా లేక నేనే ఓ నిర్ణయాన్ని చేసుకొని ఆ తరువాత ఆమెకు తెలియజేస్తూంటానా?
32.లైంగికక్రియలో జంతుభావంతో ప్రవర్తిస్తుంటానా? భార్యవద్దనుండి ఎంత సుఖం పొందుదామనే భావమేనా లేక భార్యనూ సుఖపెడదామనే భావంకూడ వుందా?
33.ఆమె కారణపూర్వకంగా దేహదానానికి అంగీకరించనపుడు నిర్బంధం చేస్తూంటానా?
34.లైంగికక్రియలో స్త్రీ మానసిక సుఖాన్ని కోరుకున్నంతగా శారీరక సుఖాన్ని కోరుకోదు. ఈ విషయంలో ఆమెపట్ల మొరటుగాను అసభ్యంగాను ప్రవర్తిస్తుంటానా?
35.ఆమెకు ద్రోహంగా నా హృదయాన్ని అన్యస్త్రీలవైపు మరలుస్తూంటానా? ఆమెను అనవసరంగా శంకిస్తూంటానా?
36.స్త్రీని ఒంటరిగా వదలివేయకూడదు అన్న నియమాన్ననుసరించి ఆమెతో కూడిమాడి వుంటూంటానా లేక యొక్కడెక్కడో కాలక్షేపంచేసి వసూంటానా?
37.ప్రేమ అంటే ఈయడంగాని పుచ్చుకోవడంకాదు. ప్రేమను మాటల్లోగాక చేతల్లో చూపించాలి. ఈ రెండు సత్యాలను నా భార్య విషయంలో ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాను?
38.ఆమె చుట్టపక్కాలు వచ్చినపుడు వారిని ఆదరిస్తుంటానా?
39.ఆమెకు నాకు భేదాభిప్రాయం కలిగినపుడు నా పట్టేనెగ్గాలి అనేలా ప్రవర్తిస్తుంటానా లేక ఆమె బాధకూడ అర్థంచేసి కూంటూంటానా?
40.మతవిషయాల్లో ఆమెకు సహాయపడుతూంటానా? ఆమె గుడికివెళ్ళి సంస్కారాలు
పొందేలా ప్రోత్సహిస్తూంటానా?
41.ఆమె అంగీకరించకపోయినా నిర్బంధంగా సంతాన నిరోధక మార్గాలు ప్రవేశపెడుతూంటానా?
42.ఈ దేహంతోను పాపంచేయకూడదు, ఈ దేహంలోను పాపం చేయకూడదు
అన్న పౌలు ఆజ్ఞను పాటిస్తున్నానా?
43.లైంగికక్రియలో నేననుభవించే ఆనందం ఇంద్రియాలతో ఆగిపోతుందా లేక ఆత్మకుకూడ సోకుతుందా?.నా ప్రేమలో కామం ఎన్నిపాళ్ళు.
44.ప్రేమ, ఆదుకోలు, పరిచర్య క్షమాపణ మొదలైన నానాకార్యాల్లో ఆమె నాకు ఋణపడుతుందా లేక నేనే ఆమెకు ఋణపడుతున్నానా?
45.అన్నికార్యాలతోపాటు లైంగికక్రియనుగూడ ప్రభువుకే సమర్పించి వివాహజీవితాన్ని పునీతం జేసికొంటున్నానా?