పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19.నేను పనిచేసే తావుల్లో మెలిగే స్త్రీలపట్ల, నా భార్యపట్ల ఇతర పురుషులు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటానో అలా ప్రవర్తిస్తూంటానా?
20.అసలు పరస్త్రీలపట్ల నా ప్రవర్తన ఏలా వుంటుంది? పరస్త్రీని మోహదృష్టితో జూచినా మానసిక వ్యభిచారం చేసినట్లే అన్నాడు ప్రభువు. ఈ యాజ్ఞ నాపట్ల ఏలా వర్తిస్తుంది.

3. నా భార్య

21.స్త్రీ హృదయాన్ని మనస్తత్వాన్ని అర్థం చేసికొని నా భార్యకు అనుకూలంగా నడుచుకుంటున్నానా?
22.నా భార్యను ఇంకా నిండు హృదయంతో ప్రేమిస్తూనే వున్నానా? ఒకవేళ తొలినాటి ప్రేమ వట్టిపోయినట్లయితే కారణమేమై వుంటుంది?
23.నా ప్రేమకు చిహ్నంగా భార్యకు బహుమతులు మన్ననలు ఇస్తూంటానా? వివాహదినం, ఆమె పుట్టినదినం జ్ఞాపకం వుంచుకుంటూంటానా?
24.పిల్లలను కనిపెంచుతూన్నందులకు, ఇల్లూ వాకిలి చక్కబెడుతూన్నందులకు, అన్నం వండిపెడుతూన్నందులకు ఇంకా నూరు సేవలు చేస్తూన్నందులకు ఆమెను మెచ్చుకుంటూంటానా?
25."స్త్రీని మెచ్చుకుంటూ వుండాలి" అన్న ధర్మాన్ని బట్టి ఆమె రూపాన్ని దుస్తులను, అలంకరణను, అణకువను, అనురాగాన్ని వంటను ప్రశంసిస్తూంటానా?
26.ఆమెకు తెలియవలసిన రహస్యాలుకూడ తెలియనీకుండ దాచిపెడుతూంటానా?
27.ఆమెపట్ల మృదువుగా మర్యాదగా ప్రవర్తిస్తుంటానా? ఆమెను అనురాగంతో పిలుస్తుంటానా? కోపం వచ్చినపుడు నాలుకను అదుపులో పెట్టుకుంటానా? లేక కటువుగా దుర్భాష లాడుతూంటానా?
28.ఇతరులముందు ఆమెను స్తుతిస్తూంటానా లేక నిందిస్తూంటానా? ఆమె లోపాలను ఇతరులముందు విమర్శిస్తుంటానా?
29.స్త్రీ వంటింటికీ పడకటింటికీ పనికివచ్చే వస్తువు అనేలా ప్రవర్తిస్తుంటానా? ఆమె నా బిడ్డల తల్లి, నాకు సహాయకురాలు అనే భావం చూపుతూంటానా, లేక చిన్నదానికి పెద్దదానికి ఆమెను ఓ పనికత్తెలాగ వాడుకొంటుంటానా? బడలిక చెందినపుడు ఆమె విశ్రాంతి పొందేలా చూస్తూంటానా?
30.క్రీస్తు-తిరుసభ అనే పోలికను గుర్తించి భార్యకోసమెంత త్యాగమైనా చేయడానికి సంసిద్ధమౌతూంటానా?