పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"ప్రేమ యేముంది?" అనే ప్రభువాక్యాన్ని సార్ధకం జేసికోరు - యోహా 15,13. దీనిద్వారాగాని భార్యాభర్తల ప్రేమ శ్రీసభ-క్రీస్తు ప్రేమ పోలికనందజాలదు.

ఇలా భార్యాభర్తలు లైంగిక క్రియలో నిస్వార్థంతో ప్రవర్తించడమనేది వాళ్ళ దాంపత్య జీవితానికీ అంతస్తునకూ సంబంధించిన పుణ్యం. కనుక దీన్ని దాంపత్యపుణ్యం అనాలి. ఈ పుణ్యాన్ని పాటించందే వాళ్ళ దాంపత్య జీవితం పునీతంకాదు. గుడికి వెళ్ళడం, జపాలు జపమాల చెప్పుకోవడం, క్రైస్తవ సంస్కారాలు పొందుతూ ఉండడం సులభం. కాని ఈ దాంపత్య పుణ్యాన్ని పాటించడం కష్టం. ఐనా ఈ పుణ్యంద్వారా భార్యాభర్తలు తమ్ము తామేగాదు, ఒకరినొకరుగూడ పవిత్రపరచుకుంటారు.

ఈలా భార్యాభర్తలు ఒకరినొకరు ప్రభు వరప్రసాదంగా భావించుకోవాలి. ఒకరిపట్ల ఒకరు మర్యాదతో, గౌరవంతో భక్తిభావంతో ప్రవర్తించాలి. ఇతరుని భజించేవాడు లేక సేవించేవాడు, భక్తుడు. ఇక సేవలేని ప్రేమంటూ లేదు. కనుక భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు భక్తిభావం ప్రదర్శించడమంటే ఒకరినొకరు ప్రేమిస్తూ సేవిస్తూ ఉండడం. ఇదీ దాంపత్య జీవితానికి తగిన భక్తి.

2. ప్రార్థనా జీవితం

ప్రార్థనలేందే కుటుంబజీవితంలో భక్తిని పెంపొందించుకోలేం. ప్రార్థన భార్యాభర్తలను ఐక్యపరుస్తుంది. బిడ్డలను తల్లిదండ్రులతో జోడిస్తుంది. రోజురోజు నియమిత కాలానికి సమావేశమై భక్తిశ్రద్ధలతో ప్రార్థన చేసుకునే కుటుంబం కూడిమాడి జీవిస్తుంది. ప్రార్థనమంటే దైనందిన కార్యాలు మానుకొని ఓ ఐదు నిమిషాలు దేవునివైపు మనస్సు మరల్చడం మాత్రమేగాదు. మరి ఆ దైనందిన కార్యాలనే దేవునివైపు మరల్చడం. ప్రార్ధనద్వారా మన జీవితంలోని కష్టాలను సుఖాలను ప్రభువునకు అర్పించుకోవాలి. మన పనులన్నీ ఆ ప్రభువునకు సమర్పితం కావాలి. మన జీవితమంతా పరలోకంలోని తండ్రికి అంకితం కావాలి. కుటుంబ ప్రార్థనలో బిడ్డలుకూడ తప్పనిసరిగా పాల్గొనాలి. ఈలా పాల్గొనడం ద్వారా పిల్లలకు ప్రార్థనాభ్యాసం అలవడుతుంది. ప్రార్థనకు అలవాటుపడిన పిల్లలు దేవుణ్ణి, దేవునికోసం తోడిప్రజలను, ప్రేమించడం నేర్చుకుంటారు. చిన్ననాడు ప్రార్థనకు అలవాటుపడిన బాలబాలికలు యౌవనప్రాయంలో చాంచల్యంవల్ల కొంతకాలం భగవంతుని విస్మరించినా, ఆ పిమ్మట మళ్ళా ప్రభువును స్మరిస్తారు. చిన్ననాడు ప్రార్ధనద్వారా పరిచయం జేసుకున్న ప్రభువును మళ్ళా సమీపిస్తారు. ఇక ఈ ప్రార్థనాభ్యాసానికి అలవాటుపడని బాలబాలికలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక ప్రపంచ వ్యామోహాల్లో చిక్కుకొని పోతారు. లౌకిక విషయాలనే వరదలోబడి కొట్టుకొనిపోతారు.