పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వవేదంలో యావే ప్రభువు యిస్రాయేలీయులతో ఒడంబడిక చేసికొన్నాడు. నూత్నవేదంలో క్రీస్తుమనతో నిబంధనం చేసికొన్నాడు. ఈలా దేవునికీ ప్రజలకూ మధ్య నిబంధనం ఏర్పడింది. ఇక, వివాహ సంస్కారం గూడ ఓ నిబంధనమే. ఈ నిబంధనం స్త్రీపురుషులిద్దరికీ మధ్య నెలకొని వుండేది. పూర్వనూత్నవేదాల్లో దేవుడు ప్రజలతో చేసికొన్న నిబంధనం నేడు మన వివాహ నిబంధనం మీద సోకి దాన్ని బలపరుస్తుంది. ఇక, పూర్వ నూత్నవేదాల నిబంధనను జ్ఞప్తికి తెచ్చేది దివ్యపూజ. ఇక్కడ ప్రభువు నూత్ననిబంధన రకాన్ని చిందిస్తాడు-మత్త 26,28. వధూవరులు సాధ్యమైనంతవరకు దివ్యపూజలోనే పెండ్లిచేసికోవాలి. ఈ పూజలో ప్రభువు శరీరక్తాలను స్వీకరించాలి. దీనిద్వారా క్రీస్తు నిబంధనం వారిపై సోకి వారి వివాహ నిబంధనాన్ని పునీతం చేస్తుంది.

క్రీస్తు దివ్యసత్ప్రసాదాన్ని స్థాపిస్తూ నేను మిమ్ము ప్రేమించినట్లే మీరూ ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు - యోహా 13,34. దివ్యసత్ప్రసాద స్వీకరణం ద్వారా దంపతుల్లో ప్రేమశక్తి బలపడుతుంది. ప్రభువు వారి వివాహబంధాన్ని దీవించి వారిని గాఢంగా ఐక్యపరుస్తాడు. వివాహితులకు ప్రేమను మించిన సౌభాగ్యం ఏముంటుంది కనుక?

దంపతులు జీవితాంతమూ పూజలో తరచుగా పాల్గొని దివ్యసత్ర్పసాదాన్ని స్వీకరిస్తూండాలి. దివ్యభోజనం వారి పరస్పర ప్రేమనూ పరస్పరదానాన్నీ బలపరచే సాధనం.

6. వివాహమూ త్రీత్వమూ

క్రీస్తు తండ్రి నుండి ఆత్మను పంపి తిరుసభను నెలకొల్పాడు. తిరుసభ సభ్యుల్లో పరిశుద్ధ త్రీత్వం రూపురేఖలు కన్పిస్తాయి. ఇక, వివాహం క్రీస్తు తిరుసభల పోలికను సూచించేది. కనుక తిరుసభలోని పరిశుద్ధ త్రీత్వం పోలికలు వివాహ జీవితంలోగూడ కన్పిస్తాయి. ఏలాగ?

పరిశుద్ధ త్రీత్వంలో తండ్రి కుమారుల ఐక్యతనుండి ఆత్మ ఉద్భవిస్తుంది. అలాగే కుటుంబంలో తల్లిదండ్రుల ఐక్యతనుండి సంతానం కలుగుతుంది. త్రీత్వంలోని తండ్రీ కుమారులు మన కుటుంబంలోని తండ్రీ తల్లులను పోలివుంటారు. పవిత్రాత్మ మన కుటుంబంలోని సంతానాన్ని పోలివుంటుంది. త్రీత్వంలో తండ్రికుమారుల నుండి ఆత్మ బయలుదేరినట్లే, కుటుంబంలో తల్లిదండ్రులనుండి బిడ్డలు కలుగుతారు. ఇక్కడ తల్లిదండ్రులిద్దరినీ బిడ్డలనుకనే ఏకవ్యక్తినిగా గణించాలి. వివాహ బంధంద్వారా వాళ్ళిద్దరూ ఏకశరీరమౌతారుకదా! త్రీత్వంలో తండ్రికుమారులను ఐక్యపరచే ప్రేమబంధం ఆత్మ కుటుంబంలో మాతాపితలను ఐక్యపరచే సాధనం సంతానం.