పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బిడ్డలను కని పుణ్యమార్గంలో పెంచి పెద్దజేస్తారు. ఈ ప్రత్యేకమైన దైవానుగ్రహమే లేకపోతే వివాహ జీవితం దుర్భరమౌతుంది. దానిలో ఎదురయ్యే ఒడుదుడుకులకు తట్టుకోలేరు.

ఈ ప్రత్యేకానుగ్రహంద్వారా భార్యాభర్తలు ఒకరినొకరు పవిత్రపరచుకొంటారు. ఒకరికొకరు వరప్రసాద కారకులౌతారు. ఈ వరప్రసాదం తల్లిదండ్రులమీద పిల్లల మీదాకూడ సోకుతుంది. వాళ్ళంతా అనురాగంతో ఒకరినొకరు అంగీకరించుకొని కూడిమాడి జీవిస్తారు. కుటుంబమంతా గూడ దైవసోదర ప్రేమలతో నిండి భక్తిమంతంగా జీవిస్తుంది. ఉత్థానక్రీస్తు వివాహబంధంద్వారా ఈ వరప్రసాదాలన్నిటినీ కుటుంబానికి దయచేస్తాడు. దంపతులు ఎప్పడుగూడ ఈ ప్రత్యేక వరప్రసాదాన్ని అధికాధికంగా దయచేయమని ప్రభువుని వేడుకొంటుండాలి.

4. వివాహమూ తిరుసభ అభివృద్ధి

భార్యాభర్తల ఐక్యత క్రీస్తు తిరుసభల ఐక్యతను పోలి వుంటుంది. దంపతులు బిడ్డలను కని మానవ సమాజాన్ని పెంచుతారు. ఆ బిడ్డలకు జ్ఞానస్నానమిప్పించి వారిని దేవుని బిడ్డలనుగా తయారుచేస్తారు. తల్లిదండ్రులు బిడ్డలతో గూడిన క్రైస్తవ కుటుంబం ఓచిన్నతిరుసభలాంటిది. ఈలాంటి చిన్నతిరుసభలు చాల చేరి విశ్వ తిరుసభ ఔతాయి.

క్రీస్తు వరప్రసాదం తిరుసభను చేరుతుంది. వివాహ సంస్కారంద్వారా తిరుసభ ఈ వరప్రసాదాన్ని దంపతులకు అందిస్తుంది. దంపతులు తమ ఐక్యతద్వారా క్రీస్తు తిరుసభల ఐక్యతను లోకానికి వెల్లడిచేస్తారు. దంపతులూ బిడ్డలూ కలసి కుటుంబమౌతారు. చాల కుటుంబాలు చేరి స్థానిక తిరుసభ ఔతాయి. చాల స్థానిక తిరుసభలు చేరి విశ్వశ్రీసభ ఔతాయి. స్థానిక శ్రీసభలు విశ్వ శ్రీసభకేలాగో కుటుంబాలు స్థానిక శ్రీసభకు ఆలాగు. ప్రతి కుటుంబం ఓ చిన్న తిరుసభ, క్రీస్తూ తిరుసభా కలసి చెట్టనుకొంటే, ఆ చెట్టుకి పుట్టిన కొమ్మలు క్రైస్త్ఘవ కుటుంబాలు. వివాహ సంస్కారంద్వారా క్రీస్తు జ్ఞానశరీరమైన తిరుసభ శాఖోపశాఖలుగా పెరిగిపోతుంది. క్రైస్తవ కుటుంబాల పెంపు తిరుసభ పెంపు,

5. వివాహమూ దివ్యసత్ర్పసాదమూ

దివ్యసత్ర్పసాదం ఐక్యతా చిహ్నం. ఒకే రొట్టెలో పాలుపంచుకొనే మనమంతా ఒకే శరీరమాతాం - 1కొ 10,17. దివ్యసత్రసాదం క్రైస్తవుల ఐక్యతకు చిహ్నమైతే, వివాహం క్రీస్తు తిరుసభల ఐక్యతకు గుర్తు, దంపతులు దివ్యసత్ర్పసాదాన్ని స్వీకరించడంద్వారా ఈ రెండైక్యతలను తమలో ప్రతిబింబించుకొంటారు. క్రీస్తు ప్రేమను నిండుగాపొంది సంపూర్ణ ఐక్యతను సాధిస్తారు. కనుక దంపతులు తరచుగా, భక్తిభావంతో దివ్యసత్ర్పసాదాన్ని స్వీకరించాలి. దానివల్ల వాళ్ళ వివాహబంధం దృఢతరమౌతుంది.