పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బిడ్డలకు వరప్రసాదం ఈయలేరు. కాని జ్ఞానస్నానం ఇప్పించటంద్వరా వాళ్లు వరప్రసాద కారకులౌతారు. బిడ్డలను క్రీస్తు మార్గంలో పెంచి పెద్దజేయడంద్వారా వారిలో దివ్యజీవనాన్ని వృద్ధిచేస్తారు. వారిని ఇహపరాలకు చెందిన పౌరులనుగా తయారుచేస్తారు. కనుకనే వేదశాస్తులు "నరుల పరలోక జీవితానికి వివాహం నారుమడిలాంటిది" అన్నారు.

దాంపత్య జీవితం పరస్పరానురాగ జీవితం. ఈ యనురాగ ఫలితమే నూత్న జీవమైన సంతానం. ఈ దృష్టితోజూస్తే వివాహాశయాలు రెండు కాదు, ఒకటే. అది సంతానఫలాన్ని ప్రసాదించే స్త్రీపురుషుల పరస్పర ప్రేమ. 

యువతీయువకులు ఒకరినొకరు ప్రేమించి పెండ్లి చేసికొంటారు. లేదా పెండ్లిచేసికొని ప్రేమిస్తారు, వాళ్ళు ఒకరితో ఒకరు ఐక్యమై ఏకశరీరమౌతారు. ఏకవ్యక్తి ఔతారు, ఈ యైక్యత ఫలితంగా వారిద్దరి పోలిక కలిగి, వారికంటె భిన్నమైన మూడవవ్యక్తి సంతాన రూపంలో ఉద్భవిస్తాడు. ఈ మూడవవ్యక్తి వారినింకా గాఢంగా ఐక్యపరుస్తాడు.

3. వివాహ సంస్కారం ఇచ్చే వరప్రసాదం

ఉత్థాన క్రీస్తు వరప్రసాదం ఏడు దేవద్రవ్యానుమానాల ద్వారా మనమీద సోకుతుంది. ఒక్కోదేవ ద్రవ్యానుమానాం ఒక్కో ప్రత్యేక వరప్రసాదాన్నిస్తుంది. కాని మన సహకారమూ ఆశా లేందే దేవద్రవ్యానుమానాలు పనిచేయవు.

ఇక, వివాహ సంస్కారం ఇచ్చే వరప్రసాదం దంపతులు తమ వివాహ జీవితాన్ని పవిత్రంగా గడపటానికి ఉపయోగపడుతుంది. వివాహాశయాలను సాధించడానికి తోడ్పడుతుంది. పరస్పర ప్రేమ బిడ్డలను కనిపెంచి పెద్దజేయడం వివాహాశయాలని చెప్పాం. వివాహ వరప్రసాదం ఈ రెండాశయాలను సాధించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వివాహ వరప్రసాదం సంసార జీవితం గడిపేవాళ్ళకు మత్రమే లభిస్తుంది. గురువు మఠకన్యలకు లభించదు.

ఈ సంస్కారంద్వారా దంపతులకు పవిత్రీకరణ వరప్రసాదం లభిస్తుంది. క్రీస్తు తిరుసభల పోలిక ద్వారానే ఈ వరప్రసాదం దంపతులమీదికి దిగివస్తుంది. దీనిద్వారా వాళ్లు దివ్యజీవనం గడపగల్గుతారు. ఇంకా, వాళ్ళకు సహాయ వరప్రసాదంగూడ లభిస్తుంది. దీని శక్తివల్ల వివాహ విధులను నెరవేర్చగల్లుతారు. ఈ రెండు వరప్రసాదాల బలంతోనే వాళ్ళు జన్మపాపం ద్వారా సంక్రమించిన కామాన్ని జయిస్తారు. వాళ్ళ ప్రేమ జంతుప్రేమను దాటిపోయి దివ్యప్రేమగా మారుతుంది. క్రీస్తుప్రేమగా రూపొందుతుంది. దంపతులు తమ లోపాలతోపాటు, మంచి గుణాలతోపాటు ఒకరినొకరు అంగీకరించుకొంటారు. ఒకరినొకరు ప్రోత్సహించుకొంటారు. వివాహ జీవితంలోని కష్టాలను ఓర్పుతో భరిస్తారు.