పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. పై రెండాశయాల పరిపూర్ణభావం

పై వివాహాశయాల భావాన్ని లోతుగా అర్థంచేసికోవాలి. వివాహ సంస్కారం సతీపతుల పరస్పర ప్రేమను పవిత్రం చేస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు నిండు హృదయంతో ప్రేమించుకొని సోదరప్రేమ అనే క్రైస్తవ పుణ్యంలో పెరుగుతారు. దీనిద్వారా తమ దైవప్రేమను గూడ వృద్ధిచేసికొంటారు.

ఇంకా, వివాహబంధం నరుల్లో సహజంగా వుండే కామవాంఛను జయించడానికిగూడ తోడ్పడుతుంది. జంతువుల్లోలాగే నరుల్లోకూడ ఆడ మగ ఒకరినొకరు కామించడం అనే నైసర్గిక గుణం వుంది. ఈ గుణం హద్దులు మీరి స్త్రీ పురుషులను పాపానికి ఫురికొల్పుతుంది. ఫలితంగా నరులు మోహానికి లొంగి వ్యభిచారంలో పడిపోతారు. ఆలుమగలు శారీరకమైన కలయికద్వారా ఈ కామవాంఛను చాలవరకు అదుపులోకి తెచ్చుకొంటారు. వివాహ సంస్కారం నైసర్గికమైన కామవాంఛలను పునీతంజేసి ప్రేమనుగా మార్చుతుంది. దీనివల్ల నరులు తమ జంతుస్వభావాన్ని దాటిపోయి దివ్యత్వాన్ని చేరుకోగల్లుతారు.

ఇంతవరకు భార్యాభర్తల పరస్పర ప్రేమనుగూర్చి. ఇక వాళ్ళు కనే సంతానాన్ని గూర్చి విచారిద్దాం. ప్రేమలో సృజనశక్తి వుంది. భార్యాభర్తల ప్రేమకుగూడ నూత్నజీవాన్ని సృష్టించే శక్రీవుంది. కనుకనే ఆలుమగలు ప్రేమతో కలసికొన్నపుడు బిడ్డలు కలుగుతారు.
భార్యాభర్తల ఐక్యతకు చిహ్నం వాళ్ళుకనే బిడ్డలు. వారి పరస్పర ప్రేమకు, పరస్పర దానానికి ప్రతిఫలం బిడ్డలు. శిశువులు తల్లిదండ్రుల ఆకారాలను రూపురేఖలను తమలో ఇముడ్చుకొని తాము ఆ యిద్దరి పరస్పర ప్రేమకు ప్రతిరూపమో అన్నట్లు ఒప్పతూంటారు. భార్యాభర్తలు తమ సంతానాన్ని చూచి సంతోషించి ఒకరితో ఒకరు ఇంకా గాఢంగా ఐక్యమౌతారు.
పిల్లలను పెంచి పెద్దజేయడంద్వారా, వారికి విద్యాబుద్ధులను నేర్పడంద్వారా తల్లితండ్రుల్లోని ప్రేమశక్తి స్పందిస్తుంది. వాళ్ళు తమ స్వార్ధాన్ని అణచుకొని బిడ్డల శ్రేయస్సునకు పాటుపడతారు. వివాహబంధంలో ప్రేమ నశించి ఆ బంధం విడిపోయే స్థితికి వచ్చినపుడు సంతాన ప్రేమే తల్లిదండ్రులను కలిపి వుంచుతుంది. బిడ్డల మేలుకొరకు అమ్మా నాన్నలు కలసి జీవించగోరుతారు.
భగవంతుని ప్రతిరూపులైన శిశువులను సృజించడంలో తల్లిదండ్రులు దేవునితో సహకరిస్తారు. వాళ్లు కేవలం మానవజాతిని అభివృద్ధి చేసేవాళ్లు మాత్రమేకాదు. క్రీస్తు శరీరమైన తిరుసభలో క్రొత్త సభ్యులను చేర్చేవాళ్లు కూడ. అమ్మానాన్నలు స్వయంగా