పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భగవంతుడు ఏంచేస్తాడో అంత స్పష్టంగా బోధపడదు. ఆ యవతారమూర్తి నరులకు వరప్రసాదం ఇస్తాడనిగానీ, నరులందరినీ రక్షిస్తాడనిగాని ఎక్కడా స్పష్టంగా విన్పించదు. ఓతావులో మాత్రం గీత "ధర్మసంస్థాపనార్ధాయ" అంటుంది - 48. అనగా ధర్మాన్ని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడని భావం. ఈ భగవంతుని అవతారం వలన మనలో మారేమీ కలుగదు. అతని సత్కార్యాలూ బోధలూ మాత్రం మనకు మార్గదర్శకంగా వుంటాయి. హిందువుల దృష్టిలో ప్రపంచానికంతటికీ ఏకైక భగవంతుడంటూ లేడు. ఎవరి ఇష్టంవచ్చిన దేవరను వాళ్ళు "ఇష్టదేవత" అన్నపేరుతో కొలుచుకొంటూంటారు అంతే.

3) సమాజం :

మనం వరప్రసాదంద్వారా ఒక్క సమాజంగా ఏర్పడతామని చెప్తాం. అదే శ్రీసభ, క్రీస్తు వరప్రసాదాలు ఈ సభ ద్వారానే మనకు లభిస్తాయి. మనలను ఈ సభలో సభ్యులనుగా చేస్తాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వరప్రసాదం వ్యక్తిగతమైందే కాని సామాజికమైందికాదు. "ఎవరికివారే యమునాతీరే" అని హిందువుల భావం. ఐనా హిందూ సాంప్రదాయంలో కూడా సామాజిక భావాలు రెండు మూడున్నాయి, సత్సంప్రదాయం అంటే సనాతన హిందువులకు చెందిన సంప్రదాయం. శిష్యులు దీన్ని పాటించాలి. ఈలా పాటించేవాళ్ళు ఓ సమాజమౌతారు. భక్తులు సదురువుతో కూడుకొనివున్న సమాజమౌతారు. సత్సమాజం లేక సత్సంగతి అంటే భక్తుల సమాజం.

ఇక్కడ మనం చెప్పిన భావాలన్నీ ప్రాచీన హిందూ మహర్షుల గ్రంథాలనుండి, బోధనలనుండీ గ్రహింపబడినవి. కాని హిందూ ప్రజలందరు ఈ శాఖకు చెందినవాళ్ళే అనుకోరాదు. హిందువుల్లో సామాన్య ప్రజలకు వరప్రసాదాన్ని గూర్చి భిన్నభావాలుంటాయి. తుకారాం, మాణిక్యవాసకరు మొదలైన భక్తులుకూడ మన క్రైస్తవుల్లాగే స్వయంకృతమైన పాపాన్ని ఒప్పకొన్నారు. భగవంతుడూ, నరుడూ ఒకటికాదని బోధించారు. భక్తితో భగవంతుని అనుగ్రహాన్ని అడుగుకొన్నారు. మనం దైనందిన జీవితంలో కలుసుకొంటూండే సామాన్య హిందూ ప్రజల్లోకూడ మన భావాలకు దగ్గరగా వుండే భావాలు విరివిగా కల్పిస్తాయి. కనుక సామాన్య హిందూ ప్రజలమార్గం వేరు. పైన మనం చూపిన ఋషులు ఆచార్యులు బోధించిన మార్గంవేరు.

మనం రెండు భిన్నమతాల భావాలను పోల్చిచూచేపడు మొదట వానిలోని భేదాలనుకాదు సామ్యాలను గుర్తించాలి. మహా మేధావియైన అగస్టీ "ప్రపంచములోని నరులందరూ సహజంగానే క్రైస్తవ భావాలు కలిగి వుంటారు" అన్నాడు. వరప్రసాదాన్ని గూర్చి ప్రాచీన హిందూ ఋషులూ, భక్తులూ ప్రతిపాదించిన సిద్ధాంతాల్లోనైతేనేమి, నేటి సామాన్య హిందూ ప్రజలు జీవించే ఆధ్యాత్మిక జీవిత విధానంలోనైతేనేమి, మన క్రైస్తవ భావాలకు సన్నిహితంగా వుండే భావాలు ఎన్ని వున్నాయో చూడండి! నరులందరిలోను ఒకే పరిశుద్దాత్మడు, ఒకే అంతర్యామి ప్రబోధం కలిగిస్తున్నాడనడానికి ఇది గొప్ప తార్మాణం గదా!