పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు చేతులుచాచి ఆ బిడ్డలను దీవించాడు- మార్కు 10,16. బిడ్డలు తల్లిదండ్రులమీద ఆధారపడి నిష్కపట జీవితం గడిపినట్లే తన శిష్యులుకూడ పరలోకపితమీద ఆధారపడి జీవించాలని హెచ్చరించాడు. క్రీస్తునాటి యూదుల రబ్బయిలుకూడ బిడ్డలను ఆదరించారు. "చిన్న బిడ్డలు మోషే ధర్మశాస్తాన్ని ఉల్లంఘించరు. నిష్కపటజీవితం గడుపుతారు. కావున పరలోకరాజ్యంలో వాళ్ళకు స్థానం వుంది” అని బోధించారు. కనుక బిడ్డల పుట్టువును కృత్రిమంగా ఆపివేయడమనేది క్రైస్తవ దృక్పథంగాదు. "నా పేరిట ఈ చిన్నబిడ్డను స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తాడు" అన్న ప్రభువు వాక్యాన్ని గౌరవించి క్రైస్తవ ప్రజలు బిడ్డల పుట్టువునకు సమ్మతించాలి — లూకా 9,43. వాళ్ళను ఆదరించాలి. క్రైస్తవ సమాజంలో వాళ్ళకూ స్థానం కల్పించాలి.

6. వివాహ వరప్రసాదం జ్ఞానశరీరాభివృద్ధికి తోడ్పడుతుంది


ఏడు దేవ ద్రవ్యానుమానాలు ఏడు ప్ర త్యేక వరప్రసాదాలనిస్తాయి. వివాహసంస్కారానికికూడ ప్రత్యేక వరప్రసాదం వుంది. వివాహితులు ఈ వరప్రసాదాన్ని గూర్చి విపులంగా తెలిసికొని వండాలి. ఈ యధ్యాయంలో ఆరంశాలు పరిశీలిద్దాం

1. వివాహం ఆశయాలు

భగవంతుడు వివాహంద్వారా ఉద్దేశించిన ఆశయాలు రెండు. భార్యాభర్తల పరస్పర ప్రేమ, సంతానోత్పత్తి వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిగా ఐక్యమౌతారు అనే ఆదికాండం 2,24వ వచనం పరస్పర ప్రేమను సూచిస్తుంది. మీరు సంతానాన్ని కని వృద్ధిచెందండి అనే ఆదికాండం 1,28 వచనం సంతానాన్ని సూచిస్తుంది.

ఈ రెండు ఆశయాల్లో ఒకటి హెచ్చు ఒకటి తగూ అంటూ లేదు. రెండూ సరిసమానమే. వివాహంద్వారా స్త్రీ పురుషులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరికొకరు ఆత్మార్పణం చేసికొంటారు. శారీరకమైన కలయిక ద్వారా దుష్టమైన వాంఛలను అదుపులోనికి తెచ్చుకొని పవిత్ర జీవితం గడుపుతారు. ఈ కలయిక ద్వారానే దేవుని పోలిక కలిగిన బిడ్డలను కంటారు. ఆ బిడ్డలను పెంచి వారికి విద్యాబుద్ధులు నేర్పుతారు. భార్యాభర్తలు ప్రేమతో శారీరకంగా కలసికొంటారు. కాని అలా కలసికొనక పూర్వమే అస్పష్టంగానైనా సంతానాన్ని కోరుకొంటారు. కలయిక తర్వాత ఈ కోరికతీరి బిడ్డలు కలుగుతారు. కనుక పరస్పర ప్రేమ సంతానోత్పత్తి అనే రెండాశయాలు ఎప్పడూ కలసే వుంటాయి.