పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలా క్రీస్తు వరప్రసాదాన్ని పొందడం వలన మూడు బహుమానాలు పొందుతాం. మొదటిది, రోజురోజుకీ మన వరప్రసాదం అభివృద్ధి చెందుతూంటుంది. తీగ రెమ్మలలోకి సారాన్ని పంపి రోజురోజుకీ ఆ రెమ్మలను పెంపునకు గొనివస్తుంది. అదే రీతిని క్రీస్తు సారము లేక వరప్రసాదము రోజురోజు మనలోనికి ప్రసరిస్తుంది. మనమూ పుష్టిని పొందుతాం. ఈ పప్లే బహుమానం.

రెండవది, నిత్యజీవితం పొందుతాం. వరప్రసాద జీవితమనగా దివ్యజీవితం జీవించడమే. ఈ దివ్యజీవితమే మరణంతో నిత్యజీవితంగా మారిపోతుంది. ఇదే మోక్షజీవితం. మూడవది, మహిమను పొందుతాం. ఉత్థాన క్రీస్తు మహిమాన్విత జీవితం జీవిస్తుంటాడు. మోక్షంలో మనమూ క్రీస్తు మహిమలో పాలు పొందుతాం. కాని మనం పాలుపొందే మహిమ మన సత్ర్కియలను బట్టి వుంటుంది.

ఇక్కడ బహుమాన స్వభావాన్ని చక్కగా అర్థం చేసికోవాలి. ప్రాకృతిక రంగంలో మన క్రియలే మనకు బహుమాన మిస్తాయి. ఉదాహరణకు కసరత్తుద్వారా దేహం పుష్టిమంతం గావించుకొంటాం. కాని ఆధ్యాత్మిక రంగంలో ఈ నియమం చెల్లదు. ఎన్ని మంచి పనులు చేసినా మనంతట మనం భగవంతుని కృపను పొందలేం. మన అంతస్తు వేరు, అతని అంతస్తు వేరు. కాని భగవంతుడే మన మీద జాలిగొని తాను మంచివాడు కావున ఆయా పుణ్యకార్యాలు చేయడానికి సహాయపడతాడు. అలా చేసిన పుణ్యకార్యాలను - అవి కేవలం మన కార్యాలేనన్నట్లు - వరప్రసాదంతో బహూకరిస్తాడు. అనగా నరులు సత్కార్యాలు చేసే సామర్థ్యమిచ్చేది భగవంతుడే. కడకు ఆ సత్కార్యాలను బహూకరించేదీ భగవంతుడే. కనుకనే అగస్టీను “దేవుడు మన పుణ్యకార్యాలకు మెచ్చి మోక్షాన్ని బహుమానంగా ఇస్తున్నాడంటే, తన సత్కార్యాలను తానే మహిమ పరచుకొంటున్నాడు" అని వ్రాసాడు.

పౌలు తన జీవితపు ప్రొద్దు పడమటకు క్రుంకినంక తిమోతికి వ్రాసిన రెండవ జాబులో "నేను మంచి పోరాటం పోరాడాను. పందెంలో గెల్చాను. విశ్వాసం నిలబెట్టుకొన్నాను. ఇక న్యాయమూర్తియైన ప్రభువు నా కొరకు కిరీట మొకటి సిద్ధం జేసి వుంచుతాడు. కడదినాన నాకది లభిస్తుంది. నా కొక్కడికే గాదు, ప్రభురాకడ కొరకై వేచివుండే వాళ్ళందరికీ ఈలాంటి కిరీటం లభిస్తుంది." అని వ్రాసాడు, ఏమిటీ కిరీటం? మోక్ష బహుమానమే. సత్ర్కియల ద్వారా పుణ్యాత్ములు పొందే బహుమానాన్నే దివ్యగ్రంథాలు "కిరీటం” అని పిలుస్తాయి. ప్రభువు తన్ను ప్రేమించే వాళ్ళకిస్తానని ప్రమాణం చేసిన జీవపు కిరీటాన్ని నీతిమంతులంతా పొందుతారు - యాకో 1, 12. మంచి క్రైస్తవ జీవితం వలనా సత్కార్యాల వలనా కలిగే బహుమానం మోక్షభాగ్యమనే కిరీటం.