పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. భగవత్కారుణ్యం

దేవుడు మనలను గూర్చి యింత శ్రద్ధ చూపడం దేనికి? మనలను యింతగా ప్రేమించడం దేనికి?

ఒకానొక పేదపడుచు. అందము నాగరకత కులీనత మొదలైన గుణాలేవీ లేవు. అందుచే ఆమెను వలచినవాళ్లే లేరు. తల్లిదండ్రులకు ఆమె భారమైంది. జీవించడంవలన ప్రయోజనమేమిటో ఆమెకు అర్థం కాలేదు. తన జీవితం తనకే బరువనిపించింది. ఈలా వుండగా బుద్ధిమంతుడైన యువరాజొకడు త్రోవవెంట వెళ్తు ఆ యువతిని జూచి జాలి గొన్నాడు. ఆమెను తన భార్యనుగా, భావి రాజ్ఞనిగా స్వీకరించాడు. తన ప్రాసాదానికి తోడ్కొని పోయాడు. ఆ యువతి మొదట భయపడింది. కాని విభుని మంచితనాన్నీ అనురాగాన్ని చూచి తెప్పరిల్లింది. క్రమేణ తన యంతస్తునకు తగినట్లుగా రాణీలాగ ప్రవర్తించింది. తీగ చెట్టుకులాగ తాను అతని కంటిపెట్టుకొని జీవించింది, సుఖపడింది.

ఈ కథ దేవునికీ మనకీ అక్షరాల వర్తిస్తుంది. ఆ యువతికి యువరాజునకు రాణి అయ్యే యోగ్యత లేదు. కేవలం అతని కారుణ్యం వలననే ఆమె రాణి కాగలిగింది. భగవంతుడు కూడ ఎందుకు పనికిరాని ప్రాణులమైన మనమీద కరుణబూని తన వరప్రసాదంతో మనకు దివ్యత్వం ఇచ్చాడు. ఓ దేవాలయంలో లాగ మన హృదయంలో వసించడం మొదలెట్టాడు. దానివలన మనకు విలువ వచ్చింది.

యూదులు కొలిచిన యావే ప్రభువు కరుణామయుడు. క్రైస్తవులు కొలిచే క్రీస్తుకూడ తన తండ్రిలాగే కారుణ్యమూర్తి తప్పిపోయిన గొర్రెను కాపరిలాగ, తప్పిపోయిన కుమారుని తండ్రిలాగ, అతడు నిత్యం మనలను వెదుక్కుంటూ వస్తాడు. బైబులు చిత్రించే ఈ భగవంతుని కారుణ్యమే అతని వరప్రసాదం.

ప్రార్ధన భావాలు

1. నాల్గవ శతాబ్దానికి చెందిన గ్రెగోరీ నాసియాన్సన్ భక్తుడు ఈలావాకొన్నాడు "నేను అల్పులడను, ఘనుడను. క్రిందివాడిని, పైవాడిని. మర్త్యుడను, అమరుడను. నాలోని వోగుణం ప్రపంచానిది, మరోగుణం దేవునిది. ఒకటి శరీరానికి మరొకటి ఆత్మకు సంబంధించింది. కనుక నేను క్రీస్తుతో చనిపోయి అతనితో ఉత్దానం కావాలి. అతని దివ్యరూపం నాలో నెలకొనాలి." వరప్రసాదం ద్వారా క్రీస్తు దివ్యరూపం మనలో నెలకొంటుంది.

2. రెండవ శతాబ్దానికి చెందిన ఇరెనేయుస్ వేదశాస్త్రి ఈలా చెప్పాడు "పొడి పిండితో రొట్టెనుగాని ముద్దనుకాని చేయలేం. నీటితో తడిపినట్లయితే పిండిని ముద్దజేసి రొట్టె చేసికోవచ్చు. అలాగే చాలమందిమైన మనం, మనలో మనం ఐక్యంగాలేం.