పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. ఐక్యత

ఐక్యత అంటే ఒక భార్య, ఒక భర్త మాత్రమే కలసి జీవించడం. కనుక బహుభర్తృత్వం, బహుభార్యాత్వం రెండూ నిషిద్దాలే.

నరులు మొదట వివాహవ్యవస్థ లేకుండా విచ్చలవిడిగా జీవించేవాళ్ళనీ, తర్వాత బహుభార్యాత్వం వాడుకలోకి వచ్చిందనీ, ఆ పిమ్మట ఏకపత్నీవిధానం వ్యాప్తిలోకి వచ్చిందనీ కొందరు సాంఘిక శాస్త్రవేత్తలు వ్రాసారు. కాని ఈ వాదాన్ని ఇప్పడు చాలమంది అంగీకరింపరు.

పెండ్లి అనాదికాలంనుండి ఉన్నదే. ఆదిమకాలంలో బహుభర్తృత్వం అక్కడక్కడ వాడుకలో ఉండివుండవచ్చు. కాని ఈ పద్ధతివల్ల పుట్టిన బిడ్డలకు చేటు కలుగుతుంది. సంతానానికి తల్లిదండ్రుల ఆదరణ లభించదు. కనుక ఈ విధానం సరైందికాదు. పైగా ఇప్పడు బహుభర్తృత్వం ఎక్కడా వాడుకలో లేదు.

ఇక బహుభార్యాత్వానికి వస్తే, ఈ విధానం అన్ని దేశాల్లోను, అన్ని కాలాల్లోను వాడుకలో వుంది. ఐనా యిది ఏనాడుకూడ బహుళ ప్రచారంలో లేదు. ఎవరో కొద్దిమంది ధనవంతులు మాత్రం దీన్ని పాటించారు.

బహుభార్యాత్వంకూడ బిడ్డలకు చేటు తెస్తుంది. ఈ పద్ధతివల్ల జన్మించే బిడ్డలకు తండ్రి ఆదరాభిమానాలు సమానంగా లభించవు. పైగా ఒక పురుషుడు ఒక స్త్రీ పరస్పర ప్రేమభావంతో ఐక్యమయ్యేది వివాహం. సంసారంలో పురుషుడు తన్ను తాను పూర్తిగా ఒక స్త్రీకి అర్పించుకోవాలి. ఆలాగే స్త్రీ కూడ తన్నుతాను పూర్తిగా ఒక పురుషునికి అర్పించు కోవాలి. బహుభార్యాత్వంలో ఈసూత్రం చెల్లదు. కనుక అది సరైన పద్ధతి కాదు.

తొలిదంపతులైన ఆదామేవల వివాహం ఏకపత్నీ విధానం. ఏవ ఆదాముకి పరాయిదికాదు. అతని శరీరంనుండి పుట్టింది. అనగా అతనిలాంటిది, అతనితో సరిసమానమైంది. వాళ్ళిద్దరూ ఏకశరీరంగా, ఏకవ్యక్తిగా ఐక్యమౌతారు. ఇది భగవంతుడు నిర్ణయించిన వివాహపద్ధతి. ఐనా పూర్వవేదంలోని యూదులు చాలమంది ఈసూత్రాన్ని బహుభార్యాత్వాన్ని పాటించారు. భగవంతుడు ఆ కాలపు పరిస్థితుల ననుసరించి వారి లోపాన్ని సహించి వూరకున్నాడు. వాళ్లు ఇప్పడు మనకు ఏమాత్రం ఆదర్శ0 కాదు.

ట్రెంటు మహాసభ క్రైస్తవులకు బహుభార్యాత్వం ఎంతమాత్రం చెల్లదని ఖండితంగా బోధించింది. క్రీస్తు తిరుసభల పోలిక సోకి క్రైస్తవవివాహం పునీతమౌతుంది. ఈ పోలికవల్ల క్రైస్తవ వివాహంలో ఏకత్వం ఇంకా బలపడుతుంది. బహుభార్యాత్వం భిన్నత్వాన్ని తెచ్చిపెడుతుంది. కనుక ఆ పద్ధతిని ఎంతమాత్రం అనుమతింపరాదు.