పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. సిరియాదేశపు సైన్యాధిపతియైన నామాను కుష్ట వ్యాధిని నయంజేయించు కోవడానికైయిస్రాయేలు ప్రవక్త ఎలీషా వద్దకు వచ్చాడు. ప్రవక్త అతన్నియోర్గానునదిలో స్నానం చేయమని చెప్పాడు. కాని నదిలో స్నానంచేస్తే కుష్టపోతుందనే నమ్మకం నామానుకు లేదు. కనుక అతడు తిరిగి సిరియాకు వెళ్ళిపోబోతున్నాడు. కాని నామాను సేవకుడు ప్రవక్తమాట నమ్మాడు. అతడు తన యజమానునికి నచ్చజెప్పి అతనిచేత ఏటిలో స్నానం చేయించాడు. దానితో నామానుకు కుష్టపోయింది 2-రాజు 5, 13-14.

4. గొల్యాతు మహావీరుడు. దావీదు చిన్నకుర్రవాడు. కాని గొల్యాతు ఆయుధాలను నమ్మకొన్నాడు. దావీదు యావే ప్రభువుని నమ్మకొన్నాడు. సామాన్య పరిస్థితుల్లో గొల్యాతులాంటి వీరుడు దావీదును పేలపిండి చేయవలసింది. కాని దైవబలాన్ని నమ్మకొన్న దావీదు గొల్యాతుని పచ్చడిచేసాడు. చివరికి నవ్విన నాపచేనే పండింది - 1సమూ 17,45.

5. యోబుని పిశాచం నానా శ్రమలతో బాధిస్తూంది. యోబు మిత్రులు అతడు దుర్మార్ణుడైయుండాలి అనుకొన్నారు. యోబు భార్య దేవుణ్ణి శపించమని భర్తను రెచ్చగొట్టింది. ఆలాంటి పరిస్థితుల్లోగూడ యోబు దేవునిమీద నమ్మిక కోల్పోలేదు. అతడు “ప్రభువు నన్ను చంపినాసరే నేను అతన్ని నమ్మితీరతాను" అన్నాడు - యోబు 13, 15.

6. యేసు చనిపోయిన లాజరుని బ్రతికించడానికి వచ్చాడు. లాజరుని ఓ కొండగుహలో పాతిపెట్టి రాతితో మూసి ఉంచారు. ప్రభువు ఆ రాతిని తొలగించమన్నాడు. మార్త "ప్రభూ లాజరు చనిపోయి నాలురోజులైంది. అతని శరీరం ఇప్పటికల్లా కంపుకొడుతూంటుంది" అంది. ప్రభువు ఆమెతో “మారా! నీవు నా పలుకులు విశ్వసించావంటే దేవునిశక్తి ఏలాంటిదో చూస్తావు" అన్నాడు. మార్త క్రీస్తుమాట విశ్వసించింది. అపుడు ప్రభువు లాజరుని వెలుపలికిరమ్మని పిల్వగానే అతడు సజీవుడై సమాధి నుండి వెలుపలికి వచ్చాడు - యోహా 11, 40.

7. ఓమారు ఓ తండ్రి పిశాచం సోకిన కుమారుడ్డి శిష్యులవద్దకు తీసికొనివచ్చాడు. కాని శిష్యులు అతన్ని స్వస్థపరచలేకపోయారు. తర్వాత తండ్రి ఆ చిన్నవాణ్ణి క్రీస్తువద్దకు తీసికొని రాగా ప్రభువు అతనికి పట్టివున్నదయ్యాన్ని పారద్రోలాడు. అటుపిమ్మట శిష్యులు ఏకాంతంగా క్రీస్తుదగ్గరికివచ్చి ఆ భూతాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామో చెప్పమని అడిగారు. ప్రభువు "మీకు చాలినంత విశ్వాసంలేదు కనుకనే పిశాచం మీ మాట వినలే”దని పల్కాడు - మత్త 18, 19-20.