పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(విశ్వసనీయురాలినిగా) మెలుగుతానని మాట యిస్తున్నాను" అనే వాక్యాలు ఉచ్చరిస్తారు. ఈ వాక్యాలద్వారా భార్యాభర్తలు ఒకరినొకరు నమ్ముతామని ప్రమాణం చేస్తున్నారు. ఈ ప్రమాణానికి తగ్గట్టుగా వాళ్ళు ఒకరినొకరు విశ్వసించాలి. ఒకరికొకరు మేలేగాని కీడు తలపెట్టకూడదు. ఒకరికొకరు విధేయులు కావాలి. ఒకరినొకరు ప్రేమించి, సేవించి అభివృద్ధిలోనికి తీసుకురావాలి. ఎప్పుడైనా భార్యాభర్తలమధ్య ఈ విశ్వాసగుణం లోపిస్తే దాన్ని వెంటనే భర్తీ చేసికోవాలి.

3. లైంగికమైన కలయిక

వధూవరులు పీఠంముందు నేను నిన్ను భార్యాగా - భర్తగా చేసికొంటున్నాను అని చెప్తారు. అనగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు స్త్రీ పురుషులనుగా అంగీకరిస్తున్నారు. స్త్రీ-పురుషులు ఒకరికొకరు కావలసినవాళ్ళు ఒకరినొకరు పరిపూర్ణం చేసికొనేవాళ్ళ వాళ్ళిద్దరు ఏకశరీరులుగా ఐక్యమై సంతానాన్ని కనాలి. పౌలు చెప్పినట్లుగా ఒకరి శరీరంమీద ఒకరు యాజమాన్యం పొందాలి - 1కొ 7,4. ఒకరికొకరు శరీరదానం చేసికోవాలి. కనుక నేను నిన్నుభార్యగా - భర్తగా చేసుకొంటున్నాను అనే మాటల్లో లైంగికమైన కలయిక, సంతానప్రాప్తి అనే భావాలుకూడ ఇమిడివున్నాయి.

4 ఎన్నిక

వధూవరులు "నేను నిన్ను భార్యగా - భర్తగా స్వీకరిస్తున్నాను" అని చెప్తారు. ఈ వాక్యాల్లో ఎన్నిక అనే భావంకూడ ఉంది. ఇంతమందిలో నిన్ను మాత్రమే నేను భార్యగా-భర్తగా స్వీకరిస్తున్నాను అనే భావంకూడ ఇమిడివుంది, వరుడు ఇందరు యువతుల్లో ఈమెను మాత్రమే తనకు భార్యగా ఎన్నుకొంటున్నాడు. అలాగే వధువు ఇందరు యువకుల్లో ఇతన్ని మాత్రమే తనకు భర్తగా ఎన్నుకొంటూంది. ఇక వాళ్ళిద్దరూ పరస్పరానురాగంతో ఐక్యభావంతో జీవించాలి. ఇక వాళ్ళకు ఎడబాటుకాని విడాకులుకాని తగవు.

5. క్రైస్తవ వివాహం విడాకులను అంగీకరించదు

క్రైస్తవ వివాహానికి ఐక్యత, అవిచ్చిన్నత అనే రెండు గుణాలున్నాయి. వివాహం చేసికొనేవాళ్ళ స్వేచ్చగానే చేసికొంటారు. ఐనా వివాహం చేసికొన్న పిదప అందరూ ఈ రెండు లక్షణాలను పాటించవలసిందే. క్రీస్తు మానవలోకంలో సహజంగావున్న వివాహాన్నే దేవద్రవ్యానుమానంగా మార్చాడు. దానితో ఐక్యత, అవిచ్చిన్నత అనే రెండుగుణాలు ఇంకా బలపడ్డాయి. ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.