పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎవడైనా ఉంటే అతడు ఆమెమీద మొదటిరాయి వేయవచ్చు" అన్నాడు. వాళ్లంతా సిగ్గుపడిపోయి ఆమెను వదలివేసి ఒకరి తరువాత వొకరు మెల్లగా జారుకొన్నారు. మీరూ ఈమెలాగే పాపాత్ములైయుండగా ఈమెను దండించే అధికారం మీకెక్కడి నుండి వచ్చిందని వాళ్ల అంతరాత్మే వాళ్లను ప్రబోధించింది - యోహా 8, 7-11. ప్రథమాచార్యులు క్రీస్తుకు మరణశిక్ష విధించమని పిలాతుని ఒత్తిడిచేసారు. అతడు వెనుదీసాడు. వాళ్ళ క్రీస్తుని చంపించకపోతే నీవు సీజరు చక్రవర్తికి స్నేహితుడివి కాలేవు. మేము నీమీద ఫిర్యాదుచేస్తాం” అని బెదిరించారు. పిలాతు దడిసాడు. అయినా యేసు యే నేరమూ చేయలేదని అతనికి బాగా తెలుసు - యోహా 16,6, ఈలా తెలిసికూడ అతడు యూదులకు జంకి నిర్దోషియైన క్రీస్తుకి మరణశిక్ష విధించాడు. పిలాతు అంతరాత్మ ప్రబోధాన్ని అణచుకొని ఈలాంటి పాడుపనికి తలపడ్డాడు. - యోహా 19,16. 1) నేను దేవుని యెదుటా మానవుల యెదుటా గూడ నిర్మలమైన అంతరాత్మను కలిగి యుండడానికై శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాను - అచ 24, 16. 2) నిర్మలమైన వాళ్లకి అన్నీ నిర్మలంగానే ఉంటాయి. మలిన మనస్కులకు అన్నీ మలినంగానే వుంటాయి. -తీతు 1, 15

20.సలహా

నరుడు నరునికి సలహా యిస్తుంటాడు. ఈ సలహామంచిదైనా కావచ్చు చెద్దదైనా కావచ్చు మంచి సలహా విన్నవాళ్ళ బాగుపడతారు. చెడ్డ సలహా విన్నవాళ్ళ నాశమైపోతారు. క్రైస్తవభక్తుడు తాను యితరులకు ఏలాంటి సలహా యిస్తుంటాడో, ఇతరులనుండి తాను ఏలాంటి సలహా పొందుతుంటాడో జాగ్రత్తగా ఆలోచించిచూచుకోవాలి. 1. యూదులు బాబిలోను ప్రవాసంలో వుండగా వాళ్ల ఆడపడుచు ఎస్తేరు ఆ దేశపు రాజును పెండ్లి చేసికొని రాణి అయింది. ఆ దేశపు రాజునకు సలహాదారుడయిన హామాను యూదులకు ప్రబల శత్రువు, ఎస్తేరునకు బంధువయిన మొర్దేకయి యూదులకు నాయకుడు. హామాను మొర్దేకయిని ఈసడించుకొన్నాడు. అతన్నేవిధంగా హతమార్చాలో చెప్పమని మిత్రులను సలహా అడిగాడు. అతని మిత్రలూ భార్యా ఏబది మూరల యెత్తుగల ఉరికంబాన్ని తయారు చేయించవలసిందనీ, దానిమీద మొర్దేకయిని ఉరితీయమని రాజుని మనవి చేయవలసిందనీ సలహా యిచ్చారు. వారు చెప్పిన దుష్టాలోచన ప్రకారమే హామాను ఉరికంబం సిద్ధం చేయించాడు. కాని దేవుడు యూదులకోపు తీసికొన్నందున చివరకు హామానునే ఆ కంబంమీద ఉరితీసారు. - ఎస్తే 5, 14.