పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంతాపపడి యేడ్చాడు. యూదా గురుద్రోహంచేసి క్రీస్తుని ముప్పది వెండి కాసులకు అమ్ముకొన్నాడు. కాని అతడు తన పాపాన్ని తలంచుకొని నిరుత్సాహపడ్డాడు. ఇక తన పాపానికి పరిహారంలేదని నిరాశచెంది ఉరివేసికొని చచ్చాడు. నరుడు ఎంతటి పాపం చేసినా భగవంతుడు క్షమిస్తాడు. కనుక అతడు నమ్మికతో పశ్చాత్తాప పడాలిగాని నిరుత్సాహపడగూడదు - లూకా 22,62; మత్త 27,5.

8. ప్రభువు ఇద్దరు యజమానులను సేవించవద్దన్నాడు. ఈ ಇద్దరు యజమానులు దేవుడూ ధనమూను - మత్త 6,24. పేత్రు దేవుణ్ణి మాత్రమే సేవించినవాడు. కనుకనే యేసు మీరు గూడ నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అడగ్గానే అతడు "ప్రభో! మేమెక్కడికి వెత్తాం? నిత్యజీవమిచ్చే మాటలు నీ నుండి వెలువడుతూన్నాయి" అన్నాడు. కాని యూదా ధనాన్ని సేవించినవాడు. క్రీస్తూ అతని శిష్యులూ తమతో కొంతడబ్బు ఉంచుకొంటూండే వాళ్లు. ఆ డబ్బులసంచి యూదా దగ్గిర ఉండేది. అతడు తనకు అవసరమైనపుడెల్లా ఆ సంచి నుండి డబ్బు కొట్టేస్తూండేవాడు. ఈ దురభ్యాసంతోనే చివరికి గురువును కూడ అమ్మేసుకొన్నాడు - యోహాను 6,68; 12,6.

9. పదిమంది కుష్టరోగులు తమ వ్యాధిని తొలగించమని ప్రభుని వేడుకొన్నాడు. అతడు మీ కుష్ట పోతుంది. మీరు వెళ్లి దేవాలయంలో యాజకునికి చూపెట్టుకొండని చెప్పాడు. త్రోవలో వాళ్లందరికి కుష్ట నయమయింది. కాని వాళ్లల్లో ఒక్కడు మాత్రం తిరిగివచ్చి ప్రభువుకి కృతజ్ఞత తెలుపుకొన్నాడు. అతన్నిచూచి ప్రభువు తతిమ్మా తొమ్మిది మంది యేరి అని అడిగాడు. తొమ్మిది మంది కృతఘ్నులూ, ఒక్కడు కృతజ్ఞతాపరుడూను - లూకా 17,17.

10. ఓ తెరువరి యెరూషలేమునుండి యెరికో వెళ్తూ దొంగలకు జిక్కిగాయపడి త్రోవప్రక్కన పడిఉన్నాడు. ఓ యాజకుడూ లేవీయుడు ఆ త్రోవవెంట బోతూ అతన్ని పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. తరువాత ఓ సమరయుడు ఆ దారి వెంట వచ్చి అతన్ని పరామర్శించాడు. ఇద్దరు అక్కరలో ఉన్నవారిని ఆదుకోకపోగా, ఒక్కడు ఆదుకొన్నాడు — లూకా 10,30-34.

11. ఓ పరిసయుడూ సుంకరీ ప్రార్థన చేసికోవడానికి దేవాలయానికి వెళ్ళారు. పరిసయుడు గర్వాత్ముడు. అతడు "ప్రభూ! నేను పుణ్యాత్ముణ్ణి. ఈ సుంకరిలాగా పాపాత్ముణ్ణి కాదు, నీకు తెలియందేముంది?" అని ప్రార్థించాడు. కాని సుంకరి వినయవంతుడు. అతడు "ప్రభో నేను పాపిని. నన్ను కరుణించు" అని ప్రార్థించాడు. భగవంతుడు పరిసయుని త్రోసిపుచ్చి సుంకరి ప్రార్థన ఆలించాడు. జీవితంలో కొందరు గర్వాత్ములూ కొందరు వినయవంతులూను. ప్రభువు మాత్రం గర్విష్తులను అణగదొక్కి వినయాత్మలను ఆదుకొంటాడు - లూకా 18,10-14.