పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అదృష్టవంతుణ్ణి. నాకు చాల యేండ్లవరకు సరిపోయేంతగా సంపదలు అబ్బాయి. కనుక సుఖంగా తిని త్రాగి ఆనందిస్తూంటాను - అనుకొన్నాడు. కాని దేవుడు మాత్రం ఓరి మూర్ఖడా! ఈ రాత్రే నీవు చనిపోవాలి. ఇక నీవు కూడబెట్టినసొత్తు ఎవరిపాలౌతుందో గదా! అన్నాడు. సిరిసంపదలు శాశ్వతంగావు. నరుడు కేవలం వాటినే నమ్మకోగూడదు — లూకా 12, 16-20.

8. 1) ప్రభూ! నాకు పేదరికమూవడద్దు, సిరిసంపదలూ వద్దు. నాకు కావలసినంత కూడుమాత్రం ఇస్తుండు. నాకు సిరిసంపదలు అబ్బాయో, నిన్ను ధిక్కరించి దేవుడెవరు అనే కాడికి వస్తానేమో! మరి పేదవాణ్ణియిపోయానో, పరుల సౌమ్మదొంగిలించి నీకు అపకీర్తి తేస్తానేమో! - 30, 8-9.

2) ఈ లోకంలో సంపదలు చేకూర్చుకొంటే వాటిని చిమ్మటలూ త్రుప్ప తినివేస్తాయి. దొంగలు అపహరిస్తారుగూడ, కాని పరలోకంలో ధనం కూడబెటుకుంటే అది అక్షయంగా వుండిపోతుంది. మన సంపదలెక్కడుంటాయో మన హృదయంగూడ అక్కడే వుండిపోతుంది - మత్త 6, 19-21.

3) విత్తవాని విత్తనాలు కొన్ని ముండ్లపొదల్లో పడ్డాయి. ఆ విత్తనాలు మొలవగానే ముండ్లపొదలు వాటిని అణచివేస్తాయి. ఇక్కడ ముండ్ల మొక్కలంటే యేమిటి? కొందరు క్రీస్తుని గూర్చిన బోధలను ఆలిస్తారు. మంచి జీవితం జీవించాలని కోరుకొంటారుగూడ. కాని లౌకిక చింతలూ ధనాశా, వ్యామోహాలూ ఆ మంచి కోరికలను కాస్త అణచివేస్తాయి. కనుక వాళ్ళు తాముకోరుకున్న దివ్యజీవితంగాక ప్రాపంచిక జీవితమే జీవిస్తారు - మార్కు 4, 18-19.

4) మన పాపవిమోచనానికై ఒడ్డిన మూల్యం వెండి బంగారాలుకాదు, అమూల్యమైన క్రీస్తురక్తం -1 పేత్రు 1,18

5) సకల అనర్దాలకు మూలం ధనాపేక్ష - 1 తిమో 6,10

6) మంచి దుస్తులు ధరించివచ్చిన ధనికుని ఆప్యాయంగా ఆదరించి, చింపిరి గుడ్డలు తొడుగుకొని వచ్చిన పేదవాణ్ణి ఆనాదరం చేయడం ధర్మమా? - యాకో 2, 2-4.

7) పొలంలో పని చేయించుకొన్నవాళ్ళకు కూలి నిరాకరించగూడదు. ఆ పంటకూలీల యేడ్పు దేవుని చెవుల్లో పడుతుంది - యాకో 5, 4.