పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3.దావీదు కుమారుడగు అమ్మోను తనకు మారుచెల్లెలు అబ్షాలోముకు సొంత చెల్లెలు ఐన తామారును చెరిచాడు. రెండేండ్లు గడిచిన తర్వాత అబ్షాలోము కపటబుద్ధితో అమ్మోనును విందునకు ఆహ్వానించాడు. అచట అమ్మోను తిని త్రాగిమైమరచి యుండగా అబ్సాలోము బంటులు అతని మీదపడి చిత్రవధ చేసారు - 2 సమూ 18, 28–29.

4. దావీదు తన సైనికుడైన ఊరియా యనువాని భార్య బత్షెబాను పొందగోరాడు. ఊరియాను ఏవిధంగానైనా మట్టుపెట్టాలనుకొన్నాడు. అప్పడు అతని సైన్యాధిపతియైన యోవాబు రాబా పట్టణాన్ని ముట్టడిస్తున్నాడు. రాజు సైన్యాధిపతికి జాబు పంపాడు, ఆ కమ్మలో "పోరు ముమ్మరంగా జరిగే తావులో ఊరియాను ముందటి వరుసలో నిలబెట్టండి. మీరంతా కాస్త ప్రక్కకు తప్పకోండి. అతడే దెబ్బలు తిని చస్తాడు” అని వ్రాసాడు. యోవాబు రాజు చెప్పినట్లేచేసి ఊరియాను చంపించాడు. ఈ విధంగా తడిగుడ్డతో గొంతుకోసాడు = 2సమూ 11, 14-17.

5. ఓ మారు క్రీస్తు తన సొంత గ్రామమైన నజరేతు వెళ్ళాడు. అక్కడి ప్రార్థనామందిరంలో బోధిస్తూ ఏ “ప్రవక్తను గూడ సొంతజనం అంగీకరించరు" అని వాక్రుచ్చాడు. ఆ నగరవాసులు క్రీస్తుమీద మండిపడ్డారు. వాళ్ళ గ్రామం ఓ కొండ మీద కట్టబడి వుంది. వాళ్లు క్రీస్తుని క్రిందికి పడదోయాలనుకొని కొండ అంచునకు తీసికొని పోయారు. కాని ప్రభువు వాళ్ళ మధ్యలోనుండి దాటి వెళ్ళిపోయాడు - లూకా 4, 28-30.

6. యూదులు క్రీస్తుని చంపాలని నిశ్చయించుకొన్నారు. కాని నరులను చంపే అధికారం చట్టరీత్యావాళ్ళకులేదు. కనుక వాళ్ళు క్రీస్తుకి మరణదండన విధించమని రోమను అధికారియైన పిలాతును ఒత్తిడి చేసారు. అతని ఉత్తరువుతో ప్రభుని సిలువ మీద కొట్టి చంపారు - యోహా 19, 15-16.

7. జ్ఞానులు క్రీస్తు శిశువును ఆరాధించడానికి పయనమై వస్తూ దారిలో హెరోదును దర్శించారు. అతడు ఈ క్రీస్తు పాపడు యూదులకు రాజౌతాడని విని తన రాజ్యానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని తల్లడిల్లి పోయాడు. హెరోదుకు ఆ శిశువును ఏలాగైనా చంపించాలన్న బుద్ధి పుట్టింది. అతడు జ్ఞానులతో "మీరువెళ్ళి శిశువును ఆరాధించండి. మళ్ల తిరిగివచ్చి అతని ఉదంతం నాకు తెలియజేయండి" అని చెప్పాడు. కాని జ్ఞానులు మళ్లా కంటబడక పోవడంవల్ల హెరోదుకు విపరీతమైన కోపం వచ్చింది. అతడు క్రీస్తు శిశువు ప్రాయం రెండేళ్ళలోపులో వుంటుందని అంచనా వేసాడు. కనుక బేల్లెహేము ప్రాంతంలో రెండేండ్లలోపులో వున్న మగబిడ్డల నందరినీ దారుణంగా చంపించాడు. ఆ ఘోర హత్యలో క్రీస్తుశిశువుకూడ నాశమై పోయి వండాలనుకొని సంబ్రాలుపడ్డాడు - మత్త 2,16.