పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. వ్యభిచారంలో పట్టుపడిన స్త్రీలను రాళ్ళు రువ్వి చంపమన్నాడు మోషే. ఓ దినం యూదులు ఆలాంటి స్త్రీ నొకతెను క్రీస్తు ఎదుటికి తీసికొనివచ్చి ఈమెకు ఏమి శిక్ష విధించాలో నీవే చెప్పమని అడిగారు. ప్రభువు మీలో పాపం చేయనివాడెవడైనా వుంటే ఆమె మీద మొదటిరాయి విసరవచ్చు అన్నాడు. ఆ మాటకు సిగ్గుపడి వాళ్ళంతా ఆమెను వదలిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభువు ఆమెతో "వాళ్ళ నిన్ను శిక్షింపలేదు. నేను కూడ నీకు శిక్ష విధింపను. ఇక వెళ్ళి పాపం చేయకుండ బ్రతుకు" అన్నాడు - యోహా 8, 10-11

7. శారీరక వ్యభిచారంతోపాటు మానసిక వ్యభిచారమనేది కూడ వుంది. పరస్త్రీని మోహదృష్టితో చూస్తే ఆమెతో మానసికంగా పాపం చేసినట్లే - మత్త 5,28.

8. పౌలు కొరింతీయులకు వ్రాసూ మనదేహం పరిశుద్దాత్మకు ఆలయమై యుంటుందని పేర్కొన్నాడు. జ్ఞానస్నానం పొందినపుడు పరిశుద్దాత్మ మన దేహంలో ఓ దేవాలయంలో లాగ నెలకొంటుంది. ఈలాంటి పవిత్ర దేహాన్ని వ్యభిచారం ద్వారా అమంగళపరచకూడదు - 1కొరి 6,19.

4. హత్య

నరులు కోపతాపాలకూ అసూయకూ గురై తోడి జనులను హత్యచేస్తూంటారు. ప్రాణాన్ని ఇచ్చే అధికారంగాని తీసికొనే అధికారంగాని మనకులేదు. భగవంతుడొక్కడే దానికి కర్త అందుచేత హత్య చాల ఘోరమైంది.

1. కయీను తమ్ముడైన హేబెలుమీద గ్రుడ్లెర్రజేసాడు. హేబెలును పొలానికి తీసుకవెళ్ళి మీదికి దూకి అతన్ని చంపివేసాడు. మా అన్నయ్య నన్ను అన్యాయంగా చంపివేసాడు అని హేబెలు నెత్తురు దేవునికి మొరపెట్టుకొంది. దేవుడు కయీనుని దేశదిమ్మరివి కమ్మని శపించాడు. ఆ శాపానికి కయీను భయపడిపోయి "జనులు నన్ను రాళ్ళ విసిరి చంపరా" అని దీనంగా మనవిజేసికొన్నాడు, దేవుడు కయీనుమీద జాలిబూని అతని నొసటిమీద ఓ భయంకరమైన గుర్తుపెట్టాడు. ఆ గుర్తుచూచి జనం భయపడిపోయి అతని యెదుటికి రాకుండాపారిపోయేవాళ్లు. అలా కయీను బ్రతికిపోయాడు - ఆది 4, 8,16.

2. సౌలుకు తన కొలువుకాడైన దావీదు అంటే కన్నుకుట్టింది. ఓమారు దావీదు సౌలుము0దర సితార వాయిస్తున్నాడు. దావీదును ఉన్నవాణ్ణి ఉన్నట్లు గోడకు గ్రుచ్చాలి అనుకొని సౌలు అతనిమీదికి ఈటె విసరాడు. కాని దావీదు నేర్పుతో ఆ వేటు తప్పించుకొన్నాడు. ఈటె మాత్రంపోయి గోడలో దిగబడింది. దావీదేమో సౌలు కొలువునుండి పారిపోయాడు - 1సమూ 19, 8-10.