పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూర్చున్నారు. సూసన్న స్నానం చేయడానికి తోటకు రాగా ఆమెను పాపంచేయమని బలాత్కరించారు. కాని ఆ గృహిణి "ఈలాంటి పాడుపనికి పూనుకొని దేవునియెదుట పాపం కట్టుకోవడంకంటె మీరు పెట్టే శిక్షననుభవించడమే మేలు" అంది. వాళ్ళ కోరికను నిరాకరించింది. వాళ్ళిద్దరూ సూసన్నమరెవరితోనో వ్యభిచారం చేసిందని సభ యెదుట ఆమెమీద కూటసాక్షాన్నిచెప్పి ఆమెను చంపించబోయారు. అపుడు దానియేలు ఆ వృదుల కూటసాక్ష్యాన్ని బట్టబయలు చేసాడు. చివరకు వాళ్ళు తలపెట్టిన మరణశిక్ష వాళ్ళమీదికే వచ్చింది — దాని 13, 19-23.

3. దావీదు ఓదినం సాయంకాలం తన మేడమీద పచార్లు చేస్తూ ప్రక్కయింట్లో స్నానమాడుతూన్న ఓ అందగత్తెను చూచాడు. ఆమె పేరు బత్షెబా, ఆమెను చూడగానే దావీదుకు మతిపోయింది. రాజు ఆమెను తన యింటికి రప్పించుకొని తనభార్యను చేసుకొన్నాడు. ఆమె భర్తయైన ఊరియాను మోసంతో యుద్ధంలో చంపించాడు. తర్వాత ఈ పాపానికి నాతాను ప్రవక్త దావీదును కఠినంగా మందలించాడు - 2సమూ 11, 2-5.

4. దావీదునకు ఒక భార్యవలన కలిగిన బిడ్డలు అబ్సాలోమనే కుమారుడు, తామారనేకొమార్తె మరియొక భార్యవలన కలిగినవాడు అమ్మోననే కుమారుడు. ఈయమ్మోనుకు తామారుపై వలపు పుట్టింది. అతడు వ్యాధిగా వున్నట్లు నటించగా దావీదు అతనిని చూడ్డానికి వచ్చాడు. అమ్మోను రాజును తామారును పంపి తనకు భోజనం సిద్ధంచేయించవలసిందిగా కోరాడు. రాజు ఆనతిపై తామారు అన్నకు భోజనం సిద్ధంచేసి ఇంటిలోనికి తీసికొనివెళ్ళి వడ్డింపబోయింది. అప్పడు అమ్మోను మారుచెల్లిని బలాత్కరంచేసి ఆమెను చెరిచాడు. అటుపిమ్మట అతనికి తామారుపై కొండంతద్వేషం పుట్టుకవచ్చింది. ఆమెను ఇంటిలోనుండి బయటికి గెంటివేసాడు. తరువాత అబ్సాలోము ఈ యమ్మోనును విందుకు ఆహ్వానించి అక్కడ అతన్ని కపటంతో చంపించివేసాడు - 2సమూ 13, 10–14.

5. పసిబిడ్డలను చంపించిన మొదటి హెరోదు కుమారుడు రెండవ హెరోదు. ఇతడు తన అన్నయైన ఫిలిప్ప భార్య హెరోదియాను ఉంచుకొన్నాడు. స్నాపక యోహాను హెరోదును నిశితంగా మందలించి ఆమెను పంపివేయమన్నాడు. హెరోదియా మత్సరంతో యోహానును చెరలో వేయించింది. ఓ దినం హెరోదియా కూతురు సభలో నాట్యంచేసి అతన్ని మెప్పించింది. అతడు ఒళ్ళు తెలియక ఆ బాలిక ఏమడిగినాయిస్తానని బాసచేసాడు. హెరోదియా యోహాను శిరస్సు ఆడగమని కూతురికి నూరిపోసింది. కూతురు చేతుల్లో నుండి యోహాను తల అందుకొన్నంకగాని హెరోదియాకు సంతృప్తి కలుగలేదు - మత్త 14, 3-5.