పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. ప్రభువు సౌలును మొదటిరాజుగా నియమించాడు. కాని అతడు మాట విననందున దేవుడు అతన్ని త్రోసివేసి దావీదును రెండవరాజుగా నియమించాడు. దావీదు సౌలు కొలువులో పనిచేస్తున్నాడు. ఓమారు సౌలు దావీదూ ఫిలిస్టీయులమీదికి యుద్దానికి వెళ్ళి వాళ్ళను చితకగొట్టి తిరిగివస్తున్నారు. త్రోవలో ఓ వూరిలో కొందరు స్త్రీలు నాట్యం జేస్తూవచ్చి సౌలు దావీదులకు స్వాగతం చెప్పారు. వాళ్లు సౌలు వేయిమంది ఫిలిస్ట్రీయులను చంపాడు. కాని దావీదు పదివేల మందిని చంపాడు అని పాటపాడారు. ఆ పాట సౌలుకు నచ్చలేదు. యిస్ర్రాయేలు స్త్రీలు తనకంటే దావీదుదే పైచేయి అని పొగడారుకదా అని సౌలు అసూయపడ్డాడు. అప్పటినుండి అతనికి దావీదును అణగదొక్కాలనే కోరిక పట్టింది. ఇంకో మారు దావీదు తనముందట సితారా వాయిస్తుండగా సౌలుకు అతన్ని బల్లెంతో గోడకు గ్రుచ్చాలనిపించింది. దావీదుమీద బల్లెం విసిరాడు. బల్లెంపోయి గోడకు గ్రుచ్చుకొంది. దావీదు మాత్రం నేర్పుతో ప్రక్కకు తప్పకొని పారిపోయాడు. -1 సమూ 18:6-11; 19: 8-10.

6. క్రీస్తు బోధలకూ అద్భుతాలకూ ప్రజలు విస్తుపోయారు. యూదనాయకులను వదలివేసి క్రీస్తును అనుసరించారు. దీన్నిచూడగా యూదుల ప్రధానాచార్యులకు మత్సరం పుట్టింది. వాళ్ల అసూయ క్రీస్తుని పిలాతుని కప్పగించేదాకా పోయింది - మార్కు 15: 10; మత్త 27:18.

7. 1) అసూయ అనేది ఎముకల్లో పుట్టే కుళ్లు - సామె 14:30
2) అసూయవలన సకలవిధాలయిన దుష్టగుణాలు పట్టుకవస్తాయి - యాకో 3:16
3) నరుడు మొదట ఆమరుడుగానే సృజింపబడ్డాడు. కాని పిశాచం అసూయవలన అతనికి శోధనమూ మరణమూ సంభవించాయి — సొలోమోను జ్ఞాన 2: 23-24
4) పిశాచం రెచ్చగొట్టగా యూదనాయకులు క్రీస్తు వధకు పూనుకొన్నారు. ఆదిలో నరహంతకుడై ఆదామునకు చావుతెచ్చిపెట్టిన పిశాచమే క్రీస్తు మరణానికి గూడ కారణమైంది. - యోహా 8:44,

2. వంచన

నరులు ఒకరి నొకరు వంచిస్తూంటారు. ఒకరి నొకరు మోసగించి లాభం పొందాలని చూస్తుంటారు. బైబులు ఈ లాంటి మోసాలను కొన్నింటిని వర్ణిస్తుంది.