పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. సహజంగానేవున్న వివాహబంధం పవిత్రమైంది.

అనాదికాలంనుండి మానవజాతిలో సహజమైన వివాహబంధం నెలకొనివుంది. ఈ వివాహం కేవలం ఓ సాంఘిక ఆచారం మాత్రమే కాదు. అది భగవంతునితో ముడివడివుంది. కనుక పవిత్రమైంది. ఈ పవిత్ర వివాహబంధాన్నే క్రీస్తు సంస్కారంగా మార్చింది.

మానవలోకంలో సహజంగా నెలకొనివున్న పరిణయం పవిత్రమైందని నిరూపించడం ఎలా? ఆదిమకాలంలోనే భగవంతుడు స్త్రీ పురుషులమధ్య ఐక్యతను నెలకొల్పి పెండ్లిని ఏర్పాటుచేసాడు. కనుక ప్రతిజాతిలోను,ప్రతిమతంలోను ప్రజలు పరిణయాన్ని దివ్యమైనదాన్నిగా ఎంచారు. దానికి ఎన్నో కర్మకాండలు చేర్చారు. దానిపట్ల గౌరవం పెంచుకొన్నారు. భగవంతుడు భార్యాభర్తలద్వారా తన బిడ్డలైన నరులను సృజిస్తాడు. పరమేశ్వరుని జీవం తల్లిదండ్రులద్వారా బిడ్డలను చేరుతుంది. దంపతులమధ్య ఉండే పరస్పరానురాగంగూడ భగవంతుని ప్రేమే. ఈ ప్రేమను అతడు దీవించి ఫలప్రదం చేస్తాడు. ఫలితంగా బిడ్డలు కలుగుతారు. ఈ శిశువులు భగవంతుని పోలిక కలవాళ్లు, కడన భగవంతుణ్ణి చేరుకొనేవాళ్లు, నరులు పెండ్లితంతుద్వారా దేవునినుండి దీవెనలుపొంది ఆ పిమ్మట శారీరకంగా ఐక్యమై దేవుని ప్రతిరూపమైన సంతానాన్ని కంటారు. ఈలా పెండ్లిలో ప్రతి అంశంలోను భగవంతుని ప్రమేయం ఉంటుంది. కనుక అది పవిత్రమైంది.

సుతుడు నరావతారం ఎత్తినపుడు అతని దైవస్వభావం మన మానవ స్వభావంతో ఐక్యమైంది. ప్రాచీనకాలంనుండి వస్తున్న స్త్రీ పురుషుల ఐక్యత ఈ దైవమానవ ఐక్యతను సూచిస్తుంది. పెండ్లి క్రీస్తునరావతారానికి గుర్తుగా ఉంటుంది. పెండ్లి పవిత్రతకు ఇదికూడ ఒక కారణం.

2. వివాహానికి సంస్కారంగా గుర్తింపు ఎప్పడు వచ్చింది?

తిరుసభ పెండ్లిని ఎప్పుడు క్రైస్తవ సంస్కారంగా గుర్తించింది? తిరుసభకు పరిణయం పవిత్రమైందని మొదటినుండి తెలుసు. కాని అది ఏడు దేవద్రవ్యానుమానాల్లో ఒకటని తొలిరోజుల్లో తెలియదు. ప్రాచీన వేదశాస్త్రులు వివాహం క్రీస్తకీ తిరుసభకూవుండే ఐక్యతను సూచిస్తుందనుకొన్నారు. నరుల్లో సహజంగా వుండి వాళ్ళను అపమార్గం పట్టించే లైంగిక వాంఛలకు అది విరుగుడుగా పనిచేస్తుందనుకొన్నారు. కాని దానివల్ల వివాహితులకు ప్రత్యేక వరప్రసాదం లభిస్తుందనుకోలేదు. పైగా వివాహజీవితంలో లింగం ప్రమేయం అధికంగా ఉంటుంది. కనుక అది వరస్రాదాన్ని ఈయలేదు అనుకొన్నారు.