పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బిషప్పు గురువులతోపాటు గృహస్తులను కూడ ప్రోత్సహించాలి. వాళ్ళ వరాలను గూడ గుర్తించి వాళ్ళ సేవలను గూడ వినియోగించుకోవాలి. వాళ్ళచేత కూడ దైవరాజ్య వ్యాప్తి చేయించాలి. అప్పడే స్థానిక తిరుసభ వృద్ధి చెందేది. తిరుసభలో 99 పాళ్లు గృహస్తులే కదా!

మొత్తంమిూద బిషప్పు ఈ కాలపు అవసరాలనూ, ఈ కాలపు గురుతులనూ గ్రహించిన నాయకుడై యుండాలి.

4. పీఠాధిపతి పరిపూర్ణమైన గురుపట్టం

అభిషేకం ద్వారా పీఠాధిపతికి పరిపూర్ణమైన గురుపట్ట దేవద్రవ్యానుమానం లభిస్తుంది. గురువుకి పరిపూర్ణమైన గురుపట్టంలేదు. అతనికి దానితో రెండవస్థానం మాత్రమే లభిస్తుంది. పరిచారకుడికి మూడవ స్థానం లభిస్తుంది. కాని బిషప్పుకి మొదటి స్థానం లభిస్తుంది.

బిషప్పు అభిషేకం పొందేపుడు తోడి బిషప్పులు అతని మిూద చేతులు చాచి ఆత్మను ఆవాహనం చేస్తారు. ఈ సాంగ్యం ద్వారా అతడు పీఠాధిపతి ఔతాడు. క్రీస్తు ప్రతినిధియై ఆ ప్రభువు మూడు లక్షణాలను స్వీకరిస్తాడు. గురువు పీఠాధిపతి నుండి గురుపట్టం పొందుతాడు. అతడు పీఠాధిపతి యాజకత్వం ద్వారా క్రీస్తు యాజకత్వంలో పాలుపొందుతాడు.

ప్రార్ధనా భావాలు

1. భాసిల్ భక్తుడు తిరుసభలోని పీఠాధిపతులను గూర్చి చెప్తూ ఈలా వ్రాసాడు. "పొట్టేళ్ళుకు ముందుగా నడుస్తూ గొర్రెలను నడిపించుకొని పోతాయి. అలాగే తిరుసభ అధికారులు కూడ క్రైస్తవ ప్రజలకు ముందుగా నడుస్తూ వాళ్ళను నడిపించుకొని పోతారు. ఆ ప్రజలచే ఆధ్యాత్మిక బోధలనే మేతను తినిపిస్తారు. ఆత్మ జలాలనే నీటిని త్రాగిస్తారు", నేటి తిరుసభకు కూడ ఈలాంటి అధికారులూ బోధకులూ లభిస్తే ఎంత బాగుంటుంది!

2. క్లెమెంటు భక్తుడు ఆదిమ క్రైస్తవ సమాజంలోని బిషప్పులను గూర్చి ఈలా చెప్పాడు. "తిరుసభలోని అధికారులు లౌకిక అధికారుల్లాగ పరిపాలనం చేయకూడదు. వాళ్లు సేవకులై మందకు ఉపచారాలు చేయాలి, ప్రజలకు తండ్రులై ఆదరభావాన్ని ప్రదర్శించాలి. వైద్యులై ప్రజలను సందర్శించాలి. కాపరులై ప్రజలను కాపాడాలి. సంగ్రహంగా చెప్పాలంటే అధికారులు నిరంతరం ప్రజల క్షేమం కొరకు కృషిచేయాలి" నేటి తిరుసభకు కూడ ఈలాంటి బిషప్పులు లభించాలని ప్రార్థిద్దాం.