పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వారా బిషప్పులు విశ్వవ్యాప్తమైన తిరుసభ బాగోగులకు పూచీపడతారు. పోపుగారితో తమకున్న సంబంధాన్ని కూడ బలపర్చుకొంటారు. బిషప్పుల సమాఖ్య ఎప్పడూ పోపుగారి ప్రమేయం లేకుండా పనిచేయదు. శిరస్సు లేకుండా వట్టి అవయవాలు పనిచేయవుకదా!

పీఠాధిపతి వ్యక్తిగతంగా తన మేత్రాసనాన్ని పరిపాలిస్తాడు. ఇతర మేత్రాసనాల మిూదగాని, విశ్వ తిరుసభమిూదగాని అతనికి అధికారం వుండదు. కాని అతడు ఎప్పడూ బిషప్పుల పరిషత్తుకు చెందినవాడే కనుక, విశ్వతిరుసభ అవసరాలపట్ల గూడ శ్రద్ధ జూపిస్తాడు. మేత్రాణులు మామూలుగా తిరుసభలోని విశ్వాసం క్రమశిక్షణ భక్తి మొదలైన కార్యాలను పట్టించుకొంటారు. ఒక స్థానిక తిరుసభ అవసరాల్లోగాని హింసల్లోగాని వుంటే దానికి సాయం జేస్తారు. వేద బోధలో శ్రద్ధ జూపుతారు. ఎవరి స్థానిక తిరుసభను వాళ్ళ వృద్ధిలోకి తీసుకవస్తారు. దీని వలన విశ్వతిరుసభ అభివృద్ధి చెందుతుంది. బిషప్పు వ్యక్తిగతంగా తన మేత్రాసనానికే బాధ్యుడు ఐనా, బిషప్పుల పరిషత్తుకు చెందినవాడుగా విశ్వ తిరుసభకు కూడ బాధ్యుడు ఔతాడు.

3. స్థానిక తిరుసభ లేక మేత్రాసనం

మేత్రాసనానికే స్థానిక తిరుసభ అనిపేరు. బిషప్పు ఎప్పుడుకూడ తన మేత్రాసనాన్ని విశ్వతిరుసభలో బాగంగా గణించాలి. అది విశ్వతిరుసభతో సంబంధం లేని ముక్క అనుకోగూడదు. తన మేత్రాసనం దానంతట అదే నిలుస్తుంది అనుకోగూడదు. అతడు తన మేత్రాసనంలో ఏక, పవిత్ర, విశ్వవ్యాప్త ప్రేషిత తిరుసభను ప్రత్యక్షం చేయాలి. స్థానిక తిరుసభలో విశ్వతిరుసభ ఇమిడే వుంటుంది. చాలా స్థానిక తిరుసభలు చేరేకదా విశ్వతిరుసభ అయ్యేది? కనుక అతడు స్థానిక తిరుసభను అభివృద్ధి చేస్తూ దానిద్వారా పరోక్షంగా విశ్వతిరుసభను అభివృద్ధి చేయాలి.

విశ్వతిరుసభలో లాగే స్థానిక తిరుసభలోని ప్రజలనందరినీ ఐక్యంజేసేది పవిత్రాత్మే ఈయాత్మ మేత్రాసనంలోని సభ్యులందరికీ ఎవరికిచ్చే వరాలను వారికిస్తుంది. బిషప్ప ఈ వరాలను సద్వినియోగం జేసికొని స్థానిక తిరుసభను అభివృద్ధిలోకి తీసుకరావాలి. స్థానిక తిరుసభలోని బలానికీ ఐక్యతకూ కంటికి కన్పించని చిహ్నంగా వుండేది పవిత్రాత్మ అదే గుణాలకు కంటికి కన్పించే చిహ్నంగా వుండేవాడు బిషప్ప, కనుక మేత్రాసనం బాగోగులు చాలవరకు అతని మిూద ఆధారపడివుంటాయి.

బిషప్పు తన గురువుల బృందంతో కలసి పనిచేయాలి. వారిని ప్రోత్సహించాలి. వారి సహకారం లేందే మేత్రాసనం వృద్ధిలోకి రాదు. అతనికీ తోడి గురువులకీ వుండే సంబంధం, పెద్దన్నకీ తమ్ముళ్ళకీ వుండే సంబంధం లాంటిది. ఎప్పడుకూడ బిషప్పులకీ గురువులకీ మధ్య ఐకమత్యం సహకారం అవసరం.