పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భర్తకు లోబడివుండాలి. క్రీస్తు శ్రీసభకులాగే, భర్త భార్యకు శిరస్సు. శిరస్సు అవయవాల్ని అదుపులో పెట్టుకుంటుంది. అదేవిధంగా భర్తకూడ భార్యను తన అధీనంలో వుంచుకుంటాడు. కావున క్రైస్తవ భార్య యొక్క ప్రధాన ధర్మంవిధేయత.

ఆ పిమ్మట క్రీస్తు, పురుషులు : క్రైస్తవ భర్త భార్యను స్వాధీనంలో వుంచుకోవడమంటే ఆమెమీద అధికారం చలాయించటంగాదు. క్రీస్తు శ్రీసభను ప్రేమించినట్లుగా అతడూ భార్యను ప్రేమిస్తుండాలి. ఇది భర్తయొక్క ప్రధాన ధర్మం.

క్రీస్తు శ్రీసభను ఎలా ప్రేమించాడు? పాపాత్మురాలైన శ్రీసభకోసం సిలువబలిద్వారా తన్ను తాను సమర్పించుకున్నాడు. క్రీస్తు తన నెత్తుటితో ఆ సభ మాలిన్యం కడిగివేసాడు. తన వాక్యబోధనమే ఆ సభకు స్నానం. ఆమెను సుందరంగా అలంకరించి తనముందు నిలుపుకున్నాడు. (ఆనాటి గ్రీకు కుటుంబాల్లో వివాహ సమయంలో వధువును చక్కగా అలంకరించి వరునిముందు నిలిపేవాళ్ళు). ఆ సభను తన వరప్రసాదంతో పోషించి కాపాడుతూవచ్చాడు. ఈలాగే భర్తకూడ భార్యకోసం తన్ను తాను అర్పించుకోవాలి. ఆమె శ్రేయస్సుకోసం పాటుపడాలి. ఆమెను ప్రేమిస్తూ ఆమెయందు ఆనందిస్తూ ఉండాలి, ఆమెను పోషిస్తూ ఆదరిస్తూ ఉండాలి. తన తల్లిదండ్రులను గూడ వదలిపెట్టి ఆమెతో ఐక్యంగావాలి. అతడు శిరస్సు, ఆమె దేహం. శిరస్సు దేహాన్ని ఆదరించినట్లే అతడూ ఆమెను ఆదరిస్తూ వుండాలి. కావున భర్తయొక్క బాధ్యతలు చాలగొప్పవి.

4. వివాహ జీవితం - సిలువ బలి

వివాహజీవితం క్రీస్తు సిలువ మరణానికి చిహ్నంగా ఉంటుంది. క్రీస్తు సిలువమిద చనిపోతేనేగాని శ్రీసభ పునీతురాలు కాలేదు. అలాగే వివాహజీవితంలోగూడ భర్తవైపున నిత్యం స్వార్ధత్యాగమంటూ ఉండాలి.భార్యాపుత్రులను ఆదరించడమంటూ ఉండాలి.

భార్య భర్తకు విధేయత చూపుతూ తాను పునీతురాలు కావాలి. తన బిడ్డలను పునీతులను జేసికోవాలి. ఆమె చేయవలసిన త్యాగం ఈ విధేయతే. ఇలా భార్యా భర్తలిద్దరుకూడ క్రీస్తునందు పునీతులు కావాలి.

ప్రార్ధనా భావాలు

1. భర్త ప్రేమ

భార్య భర్తకోసం ఉద్దేశింపబడినది - 1కొ 11,9. కావున శిరస్సు దేహాన్నివలె అతడూ ఆమెను ఆదరిస్తూ ఉండాలి-ఎఫె 5,28.