పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కృతినీ శక్తి సామర్థ్యాలనూ ఆ సభలోనికి తీసుకవచ్చారు. ఇందుచే తిరుసభ ఎంతో వృద్ధిలోకి వచ్చింది. స్థానిక తిరుసభలు విశ్వ తిరుసభను సుసంపన్నం చేసాయి. విశ్వ తిరుసభ స్థానిక తిరుసభల ప్రత్యేకతను గౌరవించింది. ఒక్క ఇండియానే తీసికొంటే, ఇక్కడ ఎన్నిరాష్ట్రాలు ఎన్ని భాషలు ఎన్ని సంస్కృతులు లేవు? ఇవన్నీ తిరుసభను సుసంపన్నం చేసాయి కదా! ఈలా ఎన్ని దేశాల్లో విశ్వతిరుసభ వ్యాపించిందో అన్ని దేశాల్లోను అది సుసంపన్న మౌతూనే వుంటుంది కదా! ఐనా వింతయేమిటంటే, విశ్వతిరుసభ ఎన్నిదేశాల్లో, ఎన్నికాలాల్లో వ్యాపించినా దాని విశ్వాసం ఒకేరీతిగా వుంటుంది. అది అందరు ప్రజలకు ఒకే రక్షణ సువార్తను బోధిస్తుంది.

3.పవిత్రత

తిరుసభ క్రీస్తకి గుర్తుగా వుండేది కనుక ఆ ప్రభువులాగే అదికూడ పవిత్రమైంది. ఎఫెసీయులు 5,25-27. తిరుసభను నిష్కళంకమైన క్రీస్తు వధువునుగా వర్ణిస్తుంది. 1కొరింతీయులు 3,16–17. దాన్నిదేవుని పవిత్రమందిరంగా వర్ణిస్తుంది. తిరుసభ సభ్యులు పునీతులు. వాళ్లు పునీత ప్రజ, పవిత్రయాజకులు 1 పేత్రు 2,9. పవిత్రాత్మే తిరుసభను పవిత్ర సమాజాన్నిగా తీర్చిదిద్దుతుంది.

1. బైబులు భావాల ప్రకారం దేవుడు పరమ పవిత్రుడు. అతని పవిత్రత ప్రధానంగా పాపానికీ పాపపు లోకానికీ దూరంగా వుండడంలో వుంటుంది. నరులమైన మనం క్రియలద్వారా పవిత్రులమౌతాం. కాని దేవుడు తన వనికిద్వారానే పవిత్రుడు.

దేవుడు తన పవిత్రతను పంచియిస్తేనే తప్ప ఏ ప్రాణి, ఏ వస్తువూ పవిత్రంకాదు. కనుక దేవునితో సంబంధం కలిగించుకోవడంద్వారా నరుడు పవిత్రుడౌతాడు.

బైబులు దేవునికి అంకితమైన నరులుగాని వస్తువులుకాని పవిత్రులౌతారని చెప్తుంది. ఈ యంకితం కావడంలో రెండంశాలున్నాయి. మొదటిది, పాపపు ప్రపంచంనుండి వేరుచేయబడ్డం. రెండవది, పవిత్రుడైన భగవంతుని సేవకు సమర్పింపబడ్డం. యాజకులు, ప్రవక్తలు, దేవాలయం, మందసం ఈలాంటివి.

పూర్వవేదంలో యిస్రాయేలు సమాజం ఇతరజాతుల నుండి వేరుచేయబడి, దేవుని సేవకు అంకితం కావింపబడింది. కనుక ఆ ప్రజ పవిత్రమైంది - నిర్గ 19,5-6. వాళ్ల పవిత్రుడైన దేవుళ్ళాగే పరిశుద్ధంగా వుండవలసినవాళ్లు.

నూత్నవేద ప్రజయైన తిరుసభకూడ పాపపు లోకంనుండి వేరుచేయబడి క్రీస్తు సేవకు అంకితమైంది. కనుక పవిత్రమైంది — 1షేత్రు 2,9. ఈ పవిత్రత ప్రజలు తమంతట తాము సాధించేది కాదు. దేవునినుండి పొందేది.ఎప్పడుకూడ దేవుని ఆత్మే మనలను పవిత్రులను చేస్తూంటుంది.