పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోరూషలేము క్రైస్తవులంతా ఒకే మనసూ ఒకే హృదయమూ కలిగి ఏక సమాజంగా జీవించారు. అ,చ, 4,32. క్రీస్తు ఒకేమందా ఒకేకాపరీ" వండాలని కోరుకొన్నాడు - యోహా 10,16. తండ్రీ క్రీస్తూ ఏకమై యున్నట్లుగా శిష్యులు కూడ తమలోతాము ఏకమై యుండాలని క్రీస్తు అభిమతం - 17,21-23. క్రైస్తవులకు ఒకే ప్రభువు ఒకే విశ్వాసం ఒకే జ్ఞానస్నానం ఒకేతండ్రియైన దేవుడు ఒకేఆత్మ ఒకే సమాజం వుందికనుక వాళ్ళంతా ఏకమై యుండాలి - ఎఫె 45-6. ఈ వేద వాక్యాలన్నీ కూడ మనలో మనం ఐక్యమై యుండాలని, అనైక్యత దైవసమాజ లక్షణం కాదనీ బోధిస్తున్నాయి.

తిరుసభ ఐక్యత నరమాత్రులు సాధించేదికాదు. పవిత్రాత్మే దాన్ని క్రైస్తవులకు వరంగా ప్రసాదించాలి, ఆత్మ మనలో మనం ఐక్యమయ్యేలాను, మనమంతా కలసి క్రీస్తుతో ఐక్యమయ్యేలాను చేస్తుంది.

తిరుసభలో ముఖ్యమైన అంశాల్లో ఐక్యత వుంటేచాలు. అనగా దానిలో ఒకే విశ్వాసం, ఒకే దేవద్రవ్యానుమానాల సముదాయం, ఒకే ఆరాధన, అందరూ ఒకే అధికారానికి లోబడి వుండడం అనే గుణాలు వుండాలి. ఇక్కడ అధికారానికి లోబడి వుండడమంటే, స్థానికంగా బిషప్పలకీ, విశ్వవ్యాప్తంగా పోపుగారికీ లోబడివుండాలి. ఈ ముఖ్యగుణాలన్నీ క్యాతలిక్ తిరుసభలో వుంటాయి. కనుక దానిలో ఐక్యత వుంది. ప్రోటస్టెంటు సమాజాల్లో ముఖ్యంగా చివరి లక్షణం లోపిస్తుంది. వాళ్ళు పోపుగారి అధికారాన్ని అంగీకరించరు. ఈ యంశం క్రైస్తవ సమైక్యతకు పెద్ద ఆటంకంగా వుంది. కాని ఆత్మ ప్రేరణంవల్ల ఈ యాటంకం వెంటనే కాకపోయినా క్రమేణ తొలగిపోవచ్చు.

క్రైస్తవ సమాజంలో ఐక్యత అంటే అన్ని క్రైస్తవ సమాజాలు మూస పోసినట్లుగా ఒకేరీతిగా వుండాలని భావంకాదు. సమాజాలకూ సమాజాలకు అప్రధాన విషయాల్లో వ్యత్యాసం వుండవచ్చు. ప్రధాన విషయాల్లో మాత్రం ఐక్యత వండాలి. పౌలునాడే యూద క్రైస్తవుల తిరుసభలూ, గ్రీకు క్రైస్తవుల తిరుసభలూ భిన్నభిన్నంగా వుండేవి. నేడు కూడ ల్యాటిన్ క్రైస్తవుల తిరుసభకూ, గ్రీకు క్రైస్తవుల తిరుసభకూ సిరియా క్రైస్తవుల తిరుసభకూ వ్యత్యాసాలు వున్నాయి. ఈ తేడాలు విశేషంగా ఆరాధన విధానంలోను క్రమశిక్షణ విధానంలోను ఆధ్యాత్మిక సాధన విషయంలోను వేదశాస్తాంశాల విషయంలోను కన్పిస్తాయి.

క్రైస్తవ సమాజాలన్నీ ఒకే విధంగా వుంటే చూడ్డానికి విసుగుపడుతుంది. కనుక అప్రధాన విషయాల్లో భిన్నత్వం మంచిది. ఈ భిన్నత్వం వలన ఒక్కో క్రైస్తవ సమాజం ప్రత్యేకంగాను ఆకర్షణీయంగాను కన్పిస్తుంది. స్థానిక సంస్కృతులు కూడ తిరుసభలోకి రావచ్చు. అందుకే ప్రాచీనకాలంలోనే అగస్టీను భక్తుడు “భిన్నత్వం వలన తిరుసభలో శోభ హెచ్చింది” అని చెప్పాడు.