పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్థానక్రీస్తు తన ఆత్మను పెంతెకోస్తు దినాన యెరూషలేములోని మెస్సీయా ప్రజలవిూదికి పంపాడు. ఆ యాత్మ వారివిూదికి గాలిలా నిప్పులా నాలుకల్లా దిగివచ్చింది - అ.చ.2.2-4. తర్వాత పేత్రు యెరూషలేములో బోధిస్తూ యోవేలు ప్రవచనం నెరవేరి ఆత్మ తమవిూదికి దిగివచ్చిందని నొక్కిచెప్పాడు - 2,16-18. పూర్వవేదం సూచించిన శేషజనమూ, మెస్సీయాజనమూ, అంత్యకాలపు జనమూ తామేననిగూడ విశదంచేసాడు.

ఈ సమాజాన్ని ఆత్మే సృజించింది. ఆత్మలోకాదిలో సృష్టి జరిగించింది. ఇప్పుడు ఈ మెస్సీయా సమాజాన్ని నెలకొల్పడం ద్వారా నూతసృష్టిని కావించింది. పూర్వం మెస్సీయాను మరియు గర్భంలో రూపొందించిన ఆత్మే ఇప్పడు ఈ మెస్సీయా సమాజాన్నిగూడ రూపొందించింది. జ్ఞానస్నానానంతరం క్రీస్తని దైవబోధకు పంపిన ఆత్మే ఇప్పడు యెరూషలేం సమాజాన్ని కూడ వేదబోధకు పంపుతుంది. జ్ఞానస్నానానంతరం ఆత్మ క్రీస్తుని చైతన్యవంతుణ్ణి చేసింది. ఇప్పడు పెంతెకోస్తు సంఘటనం తర్వాత ఆత్మ శిష్యులనుకూడ చైతన్యవంతులను చేసింది.

ఆత్మ తొలినాటి క్రైస్తవ సమాజాన్ని నడిపించినతీరు అపోస్తలుల చర్యలు అనే గ్రంథం సవిస్తరంగా వివరిస్తుంది. కనుకనే ఈ గ్రంథానికి "ఆత్మచర్యలు" అనికూడ పేరు.

3. ఇక ఆత్మ దేవాలయంలోలాగ తిరుసభలో నెలకొనివుండే తీరును పరిశీలిద్దాం. తిరుసభ దేవుడే నిర్మించిన దేవాలయం అనే భావం నూత్నవేదంలో వుంది. క్రీస్తు తన తిరుసభను పేత్రు అనే పునాది రాతిమీద ఓ మందిరంలా నిర్మిస్తానన్నాడు — మత్త 16, 18.

పూర్వవేదంలో యెరూషలేం దేవాలయం దైవసాన్నిధ్యానికి నిలయం. నా ఆలయం ప్రజలందరికి ప్రార్ధనాలయమౌతుంది అన్నాడు ప్రభువు - యెష 56,7. పూర్వవేద ప్రజకు ఓ దేవాలయమున్నట్లే నూత్న వేదప్రజకుగూడ ఓ దేవళం అవసరం. కాని నూత్నవేదంలో మెస్సీయా అతని ప్రజలూ కలసి ఈ దేవళమౌతారు. కనుక ఇక్కడ రాతిగుడికి బదులుగా ఉత్తానక్రీస్తూ అతన్ని ఆరాధించే క్రైస్తవ ప్రజ అనే దేవళం వచ్చింది. క్రైస్తవ భక్తసమాజమే దేవాలయమైంది.

క్రీస్తు విూరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి. నేనుదాన్ని మళ్ళా మూడురోజుల్లో లేపుతానన్నాడు. ఉత్థానక్రీస్తే ఈ దేవాయలం - యోహ 2,21. ఉత్తానక్రీస్తూ అతన్ని ఆరాధించే భక్తసమాజమూ కలసి ఓ మందిరమౌతుంది. నూత్నవేదంలో ఈ సమాజమే దైవసాన్నిధ్యానికి నియలం. ఈ మందిరం ఆత్మశక్తిద్వారా ఏర్పడుతుంది. కనుక ఈ దేవాలయం ఆత్మాలయంకూడ. నూతవేద ప్రజలంతా కలసి ఆత్మకు ఆలయం. ఉత్థానక్రీస్తు ఆత్మద్వారా ఈ దేవాలయంలో నెలకొనివుంటాడు. భక్తజనులను ప్రేరేపిస్తూంటాడు,