పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎదురుచూచారు. అనగా వాళ్లు కోరింది ప్రధానంగా రోమికాయుల పాలనం నుండి విముక్తి కాని క్రీస్తు కోరింది తండ్రి దయచేసే రక్షణం. అనగా ప్రజలందరికి పాప పరిహారం, శాంతి సంతోషాలు. నరులు తమ స్వీయ శక్తితోగాని, మోషే ధర్మశాస్తాన్ని పాటించడం వలనగాని ఈ రక్షణాన్ని సంపాదించలేరు. తండ్రి మాత్రమే దాన్ని దయచేయగలడు.

దైవరాజ్యాన్నిగూర్చి క్రీస్తు చేసిన బోధల్లో ఐదు ముఖ్యాంశాలున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. దైవరాజ్యం సమిూపించింది గనుక నరులు పరివర్తనం చెందాలి

తరతరాల నుండి యూదులు దైవరాజ్యం కొరకూ మెస్సియా రాకడ కొరకూ ఎదురుచూస్తూ వచ్చారు. ఆ పుణ్యకాలం రానే వచ్చింది - లూకా 10,23-24. ఈ రాజ్యంలో చేరాలంటే నరులకు రెండు గుణాలు వుండాలి. అవి పరివర్తనమూ, సువార్తను విశ్వసించడమూ - మార్కు 1,15.

ఈ పరివర్తనం హృదయగతమైంది. అనగా నరుల మనస్సులు పూర్తిగా మారాలి. వాళ్లు తమ పాప కార్యాలను వదలుకొని దేవుని వద్దకు తిరిగిరావాలి.

ఇంకా, వాళు క్రీస్తు బోధించే సువార్తను పూర్తిగా విశ్వసించాలి. ఇక్కడ పరివర్తనమూ విశ్వాసమూ కలసిపోతాయి. పరివర్తనం చెందినవాడు మాత్రమే క్రీస్తు రాకడతో దైవరాజ్యం ప్రారంభమైందని విశ్వసిస్తాడు. అలా విశ్వసించేవాడు తప్పకుండ పరివర్తనం చెందుతాడు. అతడు తన పాపాలను ఒప్పకొని దేవుని నుండి రక్షణాన్ని కోరతాడు. కనుక క్రీస్తు నరులకు ఈ రెండు గుణాలు అవసరమని చెప్పాడు. ఆనాటి పరిసయులకు పరివర్తనమూ లేదు విశ్వాసమూ లేదు. కనుకనే వాళ్ళ క్రీస్తు కొనివచ్చిన దైవరాజ్యాన్ని అంగీకరించలేదు. కాని పాపులూ సుంకరులూ మాత్రం క్రీస్తు బోధలను విశ్వసించి పశ్చాత్తాపపడి దైవరాజ్యంలో చేరారు.

2 రక్షణకాలం రానే వచ్చింది

దైవరాజ్యం రానే వచ్చింది. అది క్రీస్తు ద్వారా వచ్చింది. అసలు అతడే దైవరాజ్యం. తండ్రి ఈ క్రీస్తుద్వారా ప్రజలను రక్షిస్తాడు. కనుక క్రీస్తు రక్షణదాత. అతడు కొనివచ్చే రక్షణంతో నూత్నయుగం ప్రారంభమౌతుంది. కనుకనే అతడు నూత్నయుగంలో మనుష్యకునూరుడు మహిమాన్వితమైన సింహాసనంమీద ఆసీనుడౌతాడని చెప్పాడు-మత్త 19,28. క్రీస్తు అద్భుతాలు ఈ నూత్నయుగం, ఈ రక్షణకాలం ఆసన్నమైందని నిరూపిస్తాయి, మెస్సియా వచ్చినపుడు అద్భుతాలు జరుగుతాయని ప్రవక్తలు పూర్వమే