పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నేడు మనం కూడ ఈ యాచారాన్ని పాటించాలి. దేవుడు మనకిచ్చిన సొత్తును పేదలతో పంచుకోవడానికి పూజ అనువైన సమయం, క్రీస్తు విశేషంగా పేదల్లో శ్రమలు అనుభవిస్తుంటాడు. కనుక పేదల అక్కరలు తీర్చేవాళ్ళు క్రీస్తుని ఆదుకొన్నట్లే, ఆదివార పూజల్లో భక్తులు చందా రూపంలో తమ వంతు దానం తప్పకచేయాలి. 4. మన మర్పించిన అప్సరసాలు నడిపూజలో క్రీస్తు శరీరరకాలుగా మారిపోతాయి. పవిత్రాత్మ ఈ కార్యాన్ని నిర్వహిస్తుంది. కాని మన మర్పించే అప్సరసాలు మన జీవితాలనూ మనలనూ సూచిస్తాయి. ఈ కానుకలు క్రీస్తు శరీర రక్తాలుగా మారినపడు మనం కూడ వాటితోపాటు మారిపోతాం. క్రీస్తు ఆత్మార్పణం మన కానుకలనూ, మన ఆత్మార్పణనూ తనలోనికి స్వీకరింస్తుంది. మనం ఆధ్యాత్మిక నరులంగా తయారౌతాం. దీని ద్వారా నూత్న సమాజం ఏర్పడుతుంది. క్రీస్తు మన కొరకు ప్రాణాలు అర్పించినట్లే మనం కూడ తోడివారి కొరకు మన జీవితాలు అర్పించడానికి సిద్ధమౌతాం. ఈ విధంగా పూజలో అప్సరసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారే ఘట్టం మన జీవితాలను ప్రేమపూరితమూ దానమయమూ చేస్తుంది.

5. నడిపూజ తర్వాత సత్ప్రసాద స్వీకరణం వస్తుంది. సృష్ణ్యాదిలో దేవుని ఆత్మ ఆదిమ జలాలమీద గుండ్రంగా తిరిగింది. ఫలితంగా లోకసృష్టి జరిగింది. క్రీస్తు మరణోత్తానాల కాలంలో ఆత్మ మళ్ళా లోకంమీదికి దిగి వచ్చింది. ఈ క్రియవల్ల తిరుసభ జన్మించింది. ఈ తిరుసభ క్రైస్తవ సమాజం. ఆత్మకు నిలయం, పూజలో దివ్యసత్రసాద స్వీకరణ సమయంలో ఆత్మ మళ్ళా భక్త సమాజం మీదికి దిగివస్తుంది. ఈ దివ్యభోజనంలో మనం ఉత్తాన క్రీస్తుని స్వీకరిస్తాం. ఈ ప్రభువు ప్రభావం ద్వారా ఆత్మ మనలను ప్రేమ సమాజంగా, మన సొమ్మను ఇతరులలో పంచుకొనేవారినిగా మార్చి వేస్తుంది. 6. కడన పూజను ముగించుకొని వెళ్ళిపోతాం. కాని పూజ ముగియడమంతో మన ఆరాధనం ముగియదు. పూజ ముగింపుతో అది ప్రారంభమరౌతుంది. మనం గూడ బయటికి పోయి సత్రసాద జీవితాన్ని గడపాలి. అనగా మనం ఆ దివ్యభోజన భావాలను అర్థవంతంగా జీవించాలి. పూజలో మనం విన్న దేవుని వాక్కు దేవుని ఆత్మా ఉత్తాన క్రీస్తు మనలను లోకాన్ని మార్చివేయమని ఆదేశిస్తారు. లోకంలో ప్రేమ, కరుణ, పంచుకోవడం మొదలైన దివ్యగుణాలను పెంపొందించమని ఆజ్ఞాపిస్తారు. ఈ యాజ్ఞను మనం భక్తిభావంతో నెరవేర్చాలి.

క్రీస్తు వచ్చిందాకా మనం అతని మరణాన్ని లోకానికి ప్రకటిస్తాం - 1 కొరి 11,26. అనగా మనం ఈ లోకంలో క్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తాం. దైవ ప్రేమను సోదర ప్రేమను పెంపొందిస్తాం. ఈ నూత్న భువినీ నూత్న దివిని సృజిస్తాం. ఈ నూత్న లోకంలో అందరూ తోబుట్టువుల్లా కలసిమెలసి జీవిస్తారు. సత్ప్రసాదం ఈ మార్పులన్నీ తీసుకొని వస్తుంది.