పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనలను ప్రేమించినట్లే మనమూ ఒకరినొకరం ప్రేమించాలని ఆదేశించాడు. దీని ద్వారా ప్రేమ సమాజం ఏర్పడుతుందని చెప్పాడు. ఆదిమ క్రైస్తవులు ఈ సూత్రం ప్రకారం జీవించారు. క్రీస్తు మన మధ్య వదలిపోయిన ప్రేమ కానుక దివ్యసత్రసాదం. అది నేడు క్రీస్తు కోరిన ప్రేమ సమాజాన్ని నిర్మింప గలిగివుండాలి. ఇక సత్రసాద రహస్యాలను కొన్నిటిని పరిశీలిద్దాం. 1. సమసమాజ స్థాపనం క్రీస్తు సిలువ మీద చేతులు చాచి చనిపోయాడు. ఈ చర్య ద్వారా అతడు నరులందరినీ ఆలింగనం చేసికొని అందరినీ తన చెంతకు ఆహ్వానించాడు. సత్రసాదం క్రీస్తు చూపిన ఈ విశ్వమానవ ప్రేమకు గురుతుగా వుంటుంది. ఈ సంస్కారం ద్వారా నేడు మనం నరులందరినీ ప్రేమతో అంగీకరించాలి. మనకున్నది లేనివారితో పంచుకోవాలి. సంపదలు కూడబెట్టుకోవడం, వాటిని స్వయంగా అనుభవించడం ముఖ్యం కాదు. తోడి నరులను, విశేషంగా పేదసాదలను స్నేహభావంతో అంగీకరించడం ముఖ్యం. మనం సంపాదించింది అథోజగత్సహోదరులతో పంచుకోవడం గొప్ప పవిత్ర త్రీత్వంలోని పరస్పర ప్రేమనే మనం కూడ ఈ లోకంలో ప్రదర్శించాలి. దేవునికి నిజమైన సంతానానిమనుకోవాలి. దివ్యవిందు మనకు ఈ ప్రేరణను పుట్టిస్తుంది. 2. బలి - భోజనం నరులు ప్రాచీన కాలంనుండి దేవునికి బలులర్పించి అతనితో ఐక్యమయ్యారు. క్రీస్తు స్వీయ బలిద్వారానే దేవునితో ఐక్యమయ్యాడు. అతడు తన ఆత్మార్పణకు చిహ్నంగా దివ్యసత్రసాదాన్ని స్థాపించిపోయాడు. దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి అన్నాడు. ఈ పరమ భోజనం అతనికి మన పట్లగల ప్రేమకు గురుతు. “అతడు ఈ లోకంలో వున్న తన వారిని ప్రేమించాడు. అంతం వరకు వారిని పేమించాడు" - యోహా 13,1. క్రీస్తు మన పట్ల చూపిన ప్రేమనే మనమూ ఒకరిపట్ల ఒకరం చూపాలి. మనం ఇప్పడు ఈ దివ్యబలిని కొనసాగించి ఈ ప్రేమ భోజనాన్ని భుజిస్తున్నాం. ఈ పవిత్ర కార్యాల్లో పాల్గొనే వాళ్ళంతా ఏక కుటుంబమరొతారు. అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ ఔతారు. వీళ్ళంతా పరస్పర ప్రేమభావంతో, సేవాభావంతో, దానభావంతో జీవించాలి. 3. తోడి నరుల ద్వారానే దేవుణ్ణి చేరాలి క్రీస్తు నరులకొరకు ఈ లోకంలోనికి వచ్చాడు- ఇప్పుడు మనం తోడి నరుల ద్వారాగాని దేవుణ్ణి చేరలేం. మనకు క్రీస్తుతో సంబంధం జ్ఞానస్నానంలో ప్రారంభమౌతుంది. దివ్యసత్రసాదం ద్వారా పరిపూర్ణమౌతుంది. ఈ సంస్కారం ద్వారానే మనలోని తారతమ్యాలు