పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


2. ప్రభువు సత్ర్పసాద స్థాపన సమయంలో ఇది మీ కొరకు ఈయబడనున్న నా శరీరం అన్నాడు. ఇది మీ కొరకు చిందించబడనున్ననా రక్తం అన్నాడు. ఇవి బలి సంబంధమైన పదాలు. తర్వాత క్రీస్తు శరీరరకాలు సిలువ మీద అర్పింపబడతాయి. కనుక ఈ భోజనం సిలువను సూచిస్తుంది. ఈ సిలువబలి నరజాతి నంతటినీ దేవుని కుటుంబంగా ఐక్యపరచేది. అందుచేత సిలువబలిని సూచించే ఈ సత్ర్పసాద బలి కూడ నరుల నందరినీ ఐక్యం చేయాలి.

3. పూర్వం సీనాయి నిబంధనం ద్వారా యూదులు ఏకసమాజమయ్యారు. యావేను సేవించే భక్త సమాజమయ్యారు. ఆ సీనాయి నిబంధనం నేటి మన పూజనూ మన సత్ర్పసాదాన్నీ తలపిస్తుంది. కనుక ఈ ప్రసాదం ద్వారా గూడ మనం ఏకసమాజమౌతాం, క్రీస్తుని సేవించే భక్తబృంద మౌతాం.

4. పూజబలీ దివ్యసత్రసాదమూ పూర్వవేదంలోని బాధామయ సేవకుణ్ణి గూడ జ్ఞప్తికి తెస్తాయని చెప్పాం. ఈ సేవకుని ద్వారా పూర్వవేద ప్రజలు ఒక్కసమాజమయ్యారు - యెష 42,6. ఇక నూత్నవేదంలో క్రీస్తు ఈ బాధామయ సేవకుడు. నేడు దివ్యసత్ర్పసాదంలో వుండే ఉత్తాన సేవకుడు అతన్ని భుజించేవాళ్ళందరినీ ఒక్క సేవాసమాజంగా ఏకం జేస్తాడు. ఆ సేవకునియందు మనమందరమూ సేవకులమై పరస్పర సంబంధంతో లోకానికి సేవలు చేయాలి.

ఈలా సత్రసాదం పలువిధాలుగా సామాజిక భావాలను సూచిస్తుంది. ఈ సామాజిక స్పృహ నేడు అత్యవసరం. దేశంలో మూడువంతులు పేదలు ఒక్కవంతు ధనికులు. ఈ రెండువర్గాల వాళ్ళకీ పొత్తు కుదరక స్పర్థలూ కలహాలు చెలరేగుతున్నాయి. ప్రజలు ఒకరినుండి ఒకరు విడిపోతున్నారు. ఒకరి యెడల ఒకరు తోడేలులా ప్రవర్తిస్తున్నారు. ఈలాంటి పరిస్థితుల్లో దివ్యసత్రసాదం విభజనను గాక ఐక్యతను సాధించి పెట్టాలి. విశ్వాసులకు కలహాలను గాదు ప్రేమను చేకూర్చి పెట్టాలి. విశేషంగా తోడి పేదజనం పట్ల జాలినీ కరుణనూ పట్టించాలి. మనకున్నది తులమో ఫలమో తోడిపేదలతో పంచుకొనేలా చేయాలి. మనం దివ్యభోజనం ద్వారా ఈ సామాజిక స్పృహను పెంపొందించు కోలేకపోతే దానినుండి పొందవలసిన ఫలితాన్ని పొందలేదనే చెప్పాలి. దివ్యసత్రసాదం ద్వారా క్రీస్తుతో ఐక్యంగావడం సులభ మనిపిస్తుంది. తోడిజనంతో, విశేషంగా పేదసాదలతో, ఐక్యంగావడం కష్టమనిపిస్తుంది. ఐనా ఈ రెండింటినీ సాధిస్తేనే గాని యథార్థ క్రైస్తవులం గాలేం.