పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దివ్యసత్రసాదంలో గూడ ఆత్మ సమృద్ధిగా వుంటుంది. ఈ యాత్మా పరమప్రసాదమూ మనలను ఐక్యపరచే తీరును గూర్చి మూడవ శతాబ్ద భక్తుడు అలెగ్జాండ్రియా సిరిల్ ఈలా చెప్పాడు. "మనమందరము ఒకే ఆత్మను స్వీకరిస్తాం. ఆ యొకే ఆత్మ ద్వారా మనలో మనం ఐక్యమౌతాం. దేవునితోను ఐక్యమౌతాం. మనం చాలమందిమి. క్రీస్తు మనలో ఒక్కొక్కరిలోనికి తన ఆత్మను ప్రవేశపెడతాడు. కాని ఈ యాత్మడు ఒక్కడే అతడు మనలనందరినీ ఏకం చేస్తాడు. అతనియందు మనమందరం ఒక్కటిగా ఒనగూడేలా చేస్తాడు. ఏలాగంటే, క్రీస్తుని దివ్యభోజనంగా స్వీకరించిన వాళ్ళంతా అతనియందు ఒక్కటిగా ఐక్యమౌతారు కదా! ఈలాగే అందరిలోను వసించే ఆ వొకే ఆత్మ అందరినీ తనయందు ఒక్కటిగా ఐక్యపరుస్తుంది." ఈ వాక్యాలను బట్టి ఆత్మా దివ్యసత్రసాదమూ మనలను ఐక్యపరుస్తాయని అర్థం చేసికోవాలి.


రెండవ శతాబ్దపు ఆరాధన గ్రంథం "డిడాకే". ఆ గ్రంథం ఈలా చెప్తుంది, "ఓ ప్రభూ! ఈ పూజలో మేము విరిచే రొట్టె మొదట కొండల్లో పండిన గోదుమ గింజలు. వాటినన్నిటినీ ఏకంచేసి ఇక్కడ ఒక్క రొట్టెగా తయారుచేసాం, ఇక్కడ మేము పానంజేసే ద్రాక్షసారాయం గూడ చాల పండ్ల నుండి తీసిన రసం. ఈ పదార్థాలను లాగే శ్రీసభలోని నీ ప్రజలను గూడ లోకం నాలు చెరగుల నుండి చేరదీసి ఇక్కడ ఒక్క సమాజంగా ఏకంజేయి." ఇది చాల అర్థవంతమైన ప్రార్ధనం. చాల గోదుమగింజలు కూడి ఒక్క అప్పమూ, చాల ద్రాక్షపండ్లు కలసి చేరెడు రసమూ ఔతాయి. అలాగే చాలమంది ప్రజలు కలసి ఒక్క శ్రీసభ ఔతారు. దివ్యసత్రసాదమే మనకు ఈ ఐక్యతాభాగ్యాన్ని దయచేస్తుంది.

3. దివ్యసత్రసాదం సూచించే ఐక్యతాభావాలు

దివ్యభోజనం చాలా ఐక్యతాభావాలను సూచిస్తుంది. ప్రస్తుతం కొన్నిటిని పరిశీలిద్దాం.


1. క్రీస్తు ఏడు సంస్కారాల్లో సత్రసాదాన్ని మాత్రమే భోజనంగా నెలకొల్పాడు. పాస్కపండుగ సందర్భంలో క్రీస్తు కడపటి భోజనాన్ని భుజించాడు. కనుక ఆ పాస్మట్రోజనాన్ని గుర్తుకుతెచ్చేలా దీన్నిగూడ భోజన రూపంలో నెలకొల్పడం జరిగింది. ఇక, యూదుల సంప్రదాయం ప్రకారం భోజనం ఎప్పడు కూడ ఓ మందిని సూచిస్తుంది. ఇక్కడ పదిమందీ తిని త్రాగుతారు. వాళ్ళందరికీ పరస్పర సోదరభావం వుంటుంది. ఈ సంప్రదాయం ప్రకారం దివ్యసత్రసాదం గూడ సోదరభావాన్ని కలిగించాలి. ఈ విందులో పాల్గొనేవాళ్ళంతా అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళలాంటి వాళ్ళు కావాలి.