పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవభాగం - దివ్యసత్రసాదం భోజనం

9. దివ్యసత్రసాదం మనలను ఉత్థాన క్రీస్తుతో ఐక్యపరుస్తుంది

“నన్ను భుజించేవాడు నా మూలంగా జీవిస్తాడు" - యోహా 6,57.

మొదటి రెండు భాగాల్లో దివ్యసత్ర్పసాదం బలి, సాన్నిధ్యం అనే అంశాలు చూచాం. ఈ మూడవ భాగంలో అది భోజనం అన్న విషయం చూడాలి. ప్రస్తుతం సత్రసాదం మనలను ఉత్థాన క్రీస్తుతో ఏలా ఐక్యపరుస్తుందో విచారిద్దాం. ఈ యధ్యాయంలో ఐదంశాలు ప్రస్తావిద్దాం.

1. బలి నైవేద్యం

యూదులు బలినర్పించినపుడు ఆ బలి నైవేద్యాన్ని గూడ భుజించేవాళ్లు, మన పూజబలికి పూర్వరూపాలైన పాస్మబలిలోను నిబంధన బలిలోను ఈ నైవేద్యాలు భుజించడమనేది వుంది. మొదటి పాస్కాబలి గొర్రెపిల్లను భుజించారు. తరువాత ఆ బలిని యేటేట యెరూషలేములో కొనసాగించేపుడు కూడ గొర్రెపిల్లను భుజించేవాళ్ళు -- ద్వితీ 12,7. అలాగే నిబంధన బలి ముగిసాక గూడ మోషే, అహరోను, నాదాబు, ఆబీహు, డెబ్బదిమంది పెద్దలు కొండమీదికి వెళ్ళి దేవుని సన్నిధిలో అన్నపానీయాలు సేవించారు - నిర్గ 24,9-11.

యూదులు పాలస్తీనా దేశంలో స్థిరపడిన పిదప అర్పించిన బలుల్లో సమాధాన బలి ముఖ్యమైంది. దానిలో కోడెను గాని పొట్టేలునుగాని వధించి దాని నెత్తుటిని పీఠం మీద చిలకరించేవాళ్ళ దాని మాంసాన్నియాజకులూ బలినర్పించే భక్తులూ వండుకొని తినేవాళ్ళు. ఇది పవిత్రమైన నైవేద్యం. కనుక దీన్ని దేవళంలో ఓ నియమిత స్థలంలోనే తినాలి. ఎవరు పడితే వాళ్ళ దాన్ని ముట్టుకోగూడదు - లేవీ 7, 15. ఈ బలి నైవేద్యాలన్నీ నూత్నవేద సత్రసాదాన్ని సూచిస్తాయి.

దివ్యసత్రసాదం భోజనం అనే సంగతి నూత్నవేదంలో యోహాను సువార్త 6వ అధ్యాయం వివరంగా వర్ణిస్తుంది. ఇక్కడ మొదట సందర్భాన్ని గుర్తించాలి. క్రీస్తు ఐదు రొట్టెలతో ఐదువేల మందికి ఆహారం పెట్టాడు. ఈ యద్భుతం భక్తులకు పూర్వవేదం లోని మన్నా భోజనాన్ని గుర్తుకి తెచ్చింది - 6,1-14 మెస్సీయా వచ్చినపుడు మన్నా మళ్ళా కురుస్తుందని కూడ యూదులు నమ్మేవాళ్లు, "ఆ రోజుల్లో మళ్ళా ఆకాశం నుండి