పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొందుతారు. "శ్రేషులైన యాజకులు, పరిశుద్ధజనం, దేవుని సొత్తయిన ప్రజలు” ఔతారు - 1పేత్రు 2,9, అలా యాజకులై బలినర్పిస్తారు. కనుక నూత్నవేద ఆరాధనం కూడ వ్యక్తిగతమైంది కాదు. శ్రీసభ అంతా కలసి అర్పించేది.

2. సొంతపూజ చెల్లుతుందా ?

ప్రోటస్టెంటు సంస్కరణ నాయకులు క్రీస్తు యాజకత్వం ఒక్కటే యాజకత్వం అన్నారు. క్రైస్తవులు క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినపుడు ఆ ప్రధానగురువు యాజకత్వంలో పాలుపొంది తామూ యాజకులౌతారు. ప్రత్యేకంగా గురువుల యాజకత్వమంటూ లేదు. కనుక గురువుల యాజకత్వానికీ, గృహస్థల యాజకత్వానికీ తేడా లేదు. అసలు నూత్నవేదం గురువుల యాజకత్వాన్ని ఎక్కడా పేర్కొనదు. అది పేర్కొనేది జ్ఞానస్నానం పొందిన ప్రజలందరి సామాన్య యాజకత్వం మాత్రమే. అందుచేత గురువూ గృహస్తులూ అంతా కలసి ఒకే బలిని సమర్పించాలి. కనుక గృహస్టులు లేకుండా గురువు సొంతంగా చేసుకొనే పూజ చెల్లదు.

ట్రెంటు మహాసభ ఈ వాదాన్ని ఖండించి ఈలా బోధించింది. నూత్నవేదం ప్రత్యేకంగా చెప్పకపోయినా గురువు విశిష్ట యాజకత్వమనేది వుంది. అది ప్రజల సామాన్య యాజకత్వంకంటె భిన్నమైనది. కనుక గృహస్థలు లేకుండా గురువు చేసిన పూజ చెల్లుతుంది. అసలు గురువు సొంతపూజ అనేది లేనేలేదు. ప్రతిపూజ - గృహస్థలు హాజరైన కాకపోయినా - సామూహికమైందే. ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిది, గురువు శ్రీసభ అంతటి తరపున పూజనర్పిస్తాడు. అతని ఆరాధనం క్రైస్తవ సమాజానికి కంతటికీ ఫలితమిస్తుంది. రెండవది, అతడు వ్యక్తిగతమైన హోదాలో కాక శ్రీసభ ప్రతినిధిగా బలినర్పిస్తాడు. కనుక అతడు ప్రజల ప్రతినిధియై ప్రజల తరపున బలినర్పిస్తాడు. కనుక గురువు సాంతపూజ అనేది లేనేలేదు. ఆ పూజకు ప్రజలు హాజరైతే మరీ మంచిదే. కాని వాళ్ళు అలా హాజరు కాకపోయినా పూజేమో చెల్లుతుంది.

3. గృహస్తుల సమరపణo

పూజలో క్రీస్తు తన్నుతాను పరలోకపిత కర్పించుకొంటాడు. తనతోపాటు తన ఆధ్యాత్మిక పతియైన శ్రీసభను కూడ తండ్రి కర్పిస్తాడు. మరోలా చెప్పాలంటే పూజలో శ్రీసభ క్రీస్తుతో పాటు తన్నుతాను పితకు అర్పించుకొంటుంది. ఇక యీ శ్రీసభలో గురువు గృహస్తులు అని రెండు వర్గాలవాళ్లున్నారు. పూజలో గురువు క్రీస్తు ప్రతినిధిగా నిల్చి బలినర్పిస్తాడు. మరి గృహస్తుల సంగతి యేమిటి? వాళ్ళు కూడ పూజ బలినర్పిస్తారా? అప్పడు వాళ్ళ అర్పణానికీ గురువు అర్పణానికీ వ్యత్యాస మేమిటి?