పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13. ఈ చరణం పేర్కొనే వాన ఉపరిజలాలనుండి వచ్చింది. కొండలవిూద వూటలు ఉండవు. పైనుండి పడిన నీరే వాటికి శరణ్యం.

14. ఉపరిజలాలనుండి పడిన వానవలన గడ్డీ, పైరులూ మొక్కలూ ఎదుగుతాయి. గడ్డి దానంతటదే మొలుస్తుంది. కాని మొక్కలు, పైరులు నరుని కృషివలన ఎదుగుతాయి.

15. ద్రాక్షతోటలు, ఓలివతోటలు, గోదుమ పైరు పాలస్తీనా దేశంలోని ప్రధానపంటలు. వీటినుండి యిస్రాయేలీయులకు ద్రాక్షరసం, ఓలివత్తైలం, గోదుమరొట్టె లభించేది. ఇవన్నీ నరులకు దేవుడు దయచేసే కానుకలు. ఈ చరణం చాల సొగసైంది.

16. లెబానోను కొండలు దేవదారు వృక్షాలకు ప్రసిద్ధిచెందాయి. అవి ఎత్తుగావుండి దేవుడే తమ్ము నాటాడో అన్నట్లుగా వొప్పతున్నాయి.

17. సారస పక్షి పెద్దగూడు కడుతుంది. కనుక అది సులువుగా నరుల కంటబడుతుంది. పక్షి గూళ్ళను గూర్చి 12వ చరణంలో గూడ చెప్పాడు.

18. ఎత్తయిన కొండ శిఖరాల్లో గడ్డీ మొక్కలు అట్టే ఉండవు. కానీ అక్కడకూడ అడవిమేకల్లాంటి ప్రాణులు సంచరిస్తుంటాయి. కొండబండల్లో కుందేళ్ళలాంటి చిన్నప్రాణులు వసిస్తూంటాయి. కనుక దేవుని హస్తం అంతటా కన్పిస్తుంది. రచయిత కొండల్లోని కుందేళ్ళలాంటి చిన్నప్రాణులనుగూడ పరీక్షించి చూచాడు. అతని ప్రకృతిప్రేమ మిక్కుటమైంది.

19. నేలమిది ప్రాణులనుగూర్చి చెప్పాక, ఆకాశం లోని చంద్రుజ్జీ సూర్యుణ్ణి వర్ణిస్తున్నాడు. ప్రాచీన మానవులకు సూర్యచంద్రులే గడియారాలు, పంచాంగాలు, సూర్యుడు రేయింబవళ్ళను సూచిస్తూ నరుని పనివేళలను నిర్ణయిస్తాడు. చంద్రుడు ఋతువులనూ పండుగలనూ నిర్ణయిస్తాడు.

20. దేవుడు పగటిని నరులకూ, రేయిని మృగాలకూ కేటాయించాడు. ఆ ఉభయ వర్గాల ప్రాణులు ఒక వర్గానికొకటి అడ్డుపడవు. ఇదే దేవుని తెలివి. చీకట్లోను, వన్యమృగాల్లోను గూడ దేవుని హస్తం కన్పిస్తుంది.

21. సింహాల గర్ధనను అవి ఆహారం కొరకు దేవునికి పెట్టే మొరలనుగా ఉత్రేక్షించాడు.

22-23. మృగాలు తిరిగేప్పడు నరులు నిద్రపోతారు. నరులు తిరిగేప్పడు మృగాలు గుహల్లో నిద్రపోతాయి. ఇది సృష్టిలోని రహస్యం.

24. ఈ చరణంలో "కార్యాలు” “చెయిదాలు” దేవుడు సృజించిన ప్రాణులే. ఈ నేల అంతాకూడ దేవుడు చేసిన జీవులతో క్రిక్కిరిసి ఉంది.

25. సూర్యచంద్రులనూ రేయింబవల్లనూ గూర్చి చెప్పాక, సముద్రాన్ని వర్ణిస్తున్నాడు. సాగరం అనంతమైంది. దానిలోగూడ ఎన్నో ప్రాణులు జీవిస్తుంటాయి.