పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిస్రాయేలీయులు మూడు దీవెనలను ఘనంగా యెంచేవాళ్ళ ఆ మూడింటినీ యిక్కడ పేర్కొంటున్నాడు. 1. భక్తుడు యెరూషలేము పెంపును గాంచి సంతోషిస్తాడు. 2. అతడు పండు ముసలితనందాకా జీవిస్తాడు. 3. రెండుమూడు తరాలదాక గూడ బిడ్డలను జూచి ఆనందిస్తాడు.

3.ప్రార్థనా భావాలు

1. ఈ కీర్తన కుటుంబ జీవితాన్నీ కుటుంబ భక్తినీ కొండాడుతుంది. దేవుని దీవెనలవల్ల కుటుంబంలో తండ్రీ, తల్లీ, బిడ్డలూ కలకలలాడుతూంటారు. వాళ్ళను చూస్తే కన్నుల పండువగా ఉంటుంది. నూత్నవేదంలో క్రైస్తవులకులాగ పూర్వవేదంలో యూదులకు బ్రహ్మచర్యంలేదు. వాళ్ళది సంసారజీవితం, సంసారభక్తి మనం నేటి మన క్రైస్తవ కుటుంబాల్లో కూడ దేవుని దీవెనలు నెలకొనాలని ప్రార్థిద్దాం.
2. ఈ కీర్తనలో పేర్కొనిన గృహస్తు దైవభీతి కలవాడు. నూత్నవేదంలో మనకు దైవప్రేమలాగే పూర్వవేదంలో దైవభీతి గొప్పపుణ్యం. ఇది బానిసయజమానునిపట్ల జూపే భయంకాదు. బిడ్డడు తండ్రిపట్ల జూపే భయం. కుమారుడు తండ్రిపట్లగల ఆదరంచేత అతని ఆజ్ఞలు మిూరడానికి జంకుతాడు. దేవునిపట్ల మనంకూడ ఈలాగే ప్రవర్తించాలి. ఈ దైవభీతి నూత్నవేదంలో మనకు గూడ అవసరమే.
3. భార్యభర్తలు కలసి జీవించటం, బిడ్డలను కనిపెంచటం, శ్రమతో గూడినపని. సాగరమైనా ఈదవచ్చుగాని సంసారాన్ని ఈదలేమని మన తెలుగుసామెత. కనుక సంసారజీవితం గడిపేవాళ్ళు ఆ జీవితాన్ని యోగ్యంగాను ధర్మబద్ధంగాను జీవించేభాగ్యాన్ని ప్రసాదించమని దేవుణ్ణి అడుగుకోవాలి. తమ కుటుంబాలను దీవించమని కరుణామయుడైన ప్రభువును వేడుకోవాలి.

కీర్తన - 181

పసిబిడ్డ వాలకం

1 ప్రభూ! గర్వముతో నా హృదయము ఉప్పొంగుటలేదు
 నా కన్నులకు పొరలు కమ్మలేదు
 మహత్తర విషయములతోగాని
 నా కంతుబట్టని సంగతులతోగాని
 నేను సతమత మగుటలేదు