పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/314

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


2.సంసార జీవితం జీవించేవాళ్ళు దేవుడు తమకు దయచేసినబిడ్డలకుగాను సంతోషించాలి. నిత్యవ్యవహారంలో పిల్లలు ఎదిగొచ్చారు, పిల్లలు అక్కరకొచ్చారు అంటాం. మన జీవితం మన పిల్లల్లో కొనసాగుతుంది. ఆస్తిపాస్తులకంటె గూడ ముఖ్యమైన సంపద సంతానం. అట్టి సంతానానికి మనం దేవునికి వందనాలర్పించాలి.

3.ఈ కీర్తనలోని ప్రధానాంశం దేవునిమీద నమ్మకం. చాలమంది స్వీయకృషిని మాత్రమే ఘనంగా యెంచుతారు. ఇది పొరపాటు. పురషకారమూ దైవమూ రెండూ కలిస్తేనేగాని మనకు విజయం లభింపదు.

కీర్తన - 128

సంసార జీవితం

1.ప్రభువుపట్ల భయభక్తులు చూపుచు
అతని మార్గములలో నడచు నరులు ధన్యులు
2.నీ కష్ణార్జితమును నీ వనుభవింతువు
నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు
3.నీ లోగిట నీ భార్య
ఫలించిన ద్రాక్షతీగవలె నుండును
నీ భోజనపు బల్ల చుట్టు నీ తనయులు
ఓలివు పిలకలవలె నొప్పదురు
4.దేవునిపట్ల భయభక్తులు కల నరుడు
ఇట్టి దీవెనలు బడయును
5.నీ జీవితకాలమందెల్ల
ప్రభువు సియెనునుండి నిన్ను దీవించునుగాక
నీవు యెరూషలేము అభ్యుదయమును గాంతువుగాక
6.నీ బిడ్డల బిడ్డలను కనులార జూతువుగాక
యిస్రాయేలీయులకు శాంతి కలుగునుగాక.