పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాటించండి బ్రతికిపోతారు, లేకపోతే చెడతారు అని అతడు భక్తబృందాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇప్పడు తిరుసభ అంతటా గురువులూ మఠకన్యలూ రోజూ జపించే "డివైన్ ఆఫిస్" అనే ప్రార్థన ఈ కీర్తనతోనే ప్రారంభమౌతుంది. ఈ గీతం మనం దేవుణ్ణి భక్తితో ఆరాధించాలని చెప్తుంది. ప్రభువుని విశ్వసించి భయభక్తులతో అతని ఆజ్ఞలను పాటించాలని హెచ్చరిస్తుంది. "రండి యుత్సాహించి పాడుదము" అనే పాట ఈ 95వ కీర్తనే.

2. విభజనం

1-7ఎ. సృష్టికర్తా నిబంధన కారుడూ ఐన దేవునికి స్తుతులు

7బి-11 దేవునికి విధేయులై యుండండని భక్తులకు హెచ్చరిక

3. వివరణం

1. కీర్తనకారుడు దేవళంలోనికి వచ్చిన భక్తులను ఆరాధనలో పాల్గొనడానికిరండని ఆహ్వానిస్తున్నాడు. ప్రభువు మనకు రక్షణ దుర్గం, లేక రక్షణ శిల. అనగా రాతికోటలాగ మనలను రక్షిస్తాడని భావం.
 2. స్తుతి గానాలతో దేవళంలో ప్రభువుని ఆరాధిద్దాం రండని భక్తులను పిలుస్తున్నాడు.
 3. యావే ప్రభువు ఇతర దైవల్లాంటివాడుకాడు. అతడు దేవాధిదేవుడు. దేవతల నందరినీ ఏలేవాడు.
 4. భూగర్భాలు యావేకు ప్రత్యర్థులైన దేవుళ్ళ వసించే తావులు. అలాగే అన్యజాతి ప్రజలు పర్వత శిఖరాల విూద పరదైవాలను కొలుస్తున్నారు. యావేప్రభువు ఈ భూగర్భాలనూ పర్వతశిఖరాలనూ పరిపాలిస్తూ అచటి చిల్లరమల్లర దైవాలన్నిటిని తన చెప్పచేతల్లో ఉంచుకొంటాడు.
 5. హీబ్రూ కవుల సంప్రదాయం ప్రకారం నీళూ సముద్రమూ దేవునికి శత్రువులు. కాని ప్రభువు ఈ సాగరాన్నీ నేలనూ తన వశంలో ఉంచుకొంటాడు. అతడు వాటిని సృజించినవాడూ, ఏలేవాడూను. ప్రభువు అన్నిటికీ అధినాథుడని అర్థం. 6. దేవళంలో సృష్టికర్తయైన దేవుని ముందట మోకరిల్లి వంగి నమస్కారంచేసి మన భక్తిప్రపత్తులను వెల్లడి చేసికొందామని చెప్తున్నాడు.
 7ఎ. ప్రభువు మన దేవుడు. మనం అతని ప్రజలం. ఇవి సీనాయి నిబంధనను సూచించే వాక్యాలు, అనగా ఆ ప్రభువు సృష్టికర్త మాత్రమేకాదు ; నిబంధనకారుడు కూడ.