పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25-26. రచయిత మొక్కుబడి దేవళంలో కృతజ్ఞతా బలిని అర్పించడమే. ఈ బలిలో పొట్టేలునో కోడెనో వధిస్తారు. యాజకులూ, బలినర్పించే భక్తుడూ అతని బంధుమిత్రులూ ఆ బలిపశువు మాంసాన్ని భుజిస్తారు. కీర్తనకారుడు పేదలను గూడ ఈ బలికి ఆహ్వానిస్తాడు. ఆ పేద భక్తులు బలిలో పాల్గొని కడుపునిండ భుజిస్తారు. వాళ్ళు ప్రభువు నుండి శుభాలు పొందుతారు.

27-28. ఒక్క యిస్రయేలీయులేకాక, అన్యజాతి జనులుకూడ ప్రభువు దగ్గరికి మరలివస్తారు. దేవళంలో అతన్ని పూజిస్తారు. ఎందుకు? ఈ కీర్తనకారుడు రాజు అని చెప్పాం. అతడూ అతని పౌరులుగా కలసి ఏదో ఫనోరశ్రమలు అనుభవించి పవిత్రులయ్యారు. వాళ్ళు ఆర్ధించిన పావిత్ర్యం వలన అన్యజాతి జనులుకూడ పరివర్తనం చెంది యావే ప్రభువు దగ్గరికి వస్తారు. అతన్ని కొలుస్తారు. ఆ ప్రభువు రాజుగా వాళ్ళను పరిపాలిస్తాడు.

ఈ కీర్తనను చెప్పిన రాజు యెషయా ప్రవక్త వర్ణించిన బాధామయ సేవకుణ్ణి, క్రీస్తునీ సూచిస్తాడు. లేకపోతే అతని బాధలు అన్యజాతులకు ఉపయోగపడవు, వారికి పరివర్తనం కలిగించవు.

29-31. బహుశః ఈ మూడు చరణాలు మొదటి కీర్తనకారుడు చెప్పినవికావు. కడపటి దినాల్లో నరులందరూ యావే ప్రభువును పూజిస్తారని చెప్పడానికి, తర్వాత ఇంకో కీర్తనకారుడు వీటిని చేర్చివుంటాడు. కడపటిరోజుల్లో బ్రతికివున్న వాళ్ళూ చచ్చినవాళ్ళూ అంతా ప్రభువుకి దండం పెడతారు. భావితరాలవాళ్లు ప్రభువుని కొలుస్తారు. వాళ్లు తమ తర్వాత రాబోయే తరాలవాళ్ళకుగూడ ప్రభువు రక్షణ కార్యాలను వివరిస్తారు. అప్పడు ఎల్లరూ ప్రభుని పూజిస్తారు.

4. ప్రార్ధనా భావాలు

1. అందరంకూడ అప్పడప్పడూ వ్యాధి బాధలకూ కష్టాలకూ అపజయాలకూ నిరుత్సాహ భావాలకూ గురౌతూంటాం. ఈ కీర్తనను విశేషంగా ఈలాంటి సందర్భాల్లోనే వాడుకోవాలి. ఇంకా మనం ముసలివాళ్ళమైనప్పడు, దీర్ఘకాలవ్యాధికి గురై మంచాన బడినప్పుడు, మన అశక్తత వెల్లడౌతుంది. చాలమందిమనలను పరిత్యజిస్తారు. మనకుకూడ ఇక విజయాలను సాధించలేం, ఇక బ్రతికి ప్రయోజనం లేదు అనే నిరుత్సాహ భావాలు కలుగుతాయి. ఈ కీర్తన వ్రాసిన భక్తుని అనుభవంకూడ యిదే. లేకపోతే అతడు "నా బలం నేలమిూద చల్లిన నీళ్ళలాగ యింకిపోయింది" అని యెందుకంటాడు? ఈలా నిరాశ అనే మబ్బులు ఆవరించినపుడు ఈ కీర్తన బాగా ఉపయోగపడుతుంది. దీనిని భక్తితో మననంజేసికోవడంవల్ల మల్లా ఆశా దేవునిమిూద నమ్మకమూ కలుగుతాయి. ఈ