పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. పరిచయం

ఇది విలాప కీర్తనల వర్గానికి చెందింది. బైబుల్లోని గొప్ప విలాప కీర్తనల్లో ఇదికూడ ఒకటి. ఈ గీతంలో కీర్తనకారుడు తన బాధలను వర్ణించాడు. అతడు తన శారీరక శ్రమలను మానసిక శ్రమలను శత్రుపీడనాన్ని గూర్చి చెప్పకొన్నాడు. నూత్నవేదం ఈ కీర్తనకారుని బాధలను క్రీస్తు బాధలకు అన్వయింపజేస్తుంది. కనుక ఇది మెస్సియాను సూచించే కీర్తన.

ఈ గీతం చెప్పిన భక్తుడు రాజైవుండవచ్చు. ఈ గేయంలో అతడు తన్నూతన ప్రజలనూ కలుపుకొని మాట్లాడాడు. రాజు పౌరులతో గూడిన యిస్రాయేలుప్రజ అంతా ఘరోరశ్రమల ననుభవించి పవిత్రమైంది. ఈ ప్రజ అనుభవించిన శ్రమల ఫలితంగా అన్యజాతి జనులు పరివర్తనం చెందుతారు. వాళ్లకూడదేవళానికివచ్చి ప్రభుని ఆరాధిస్తారు. ఈ యిప్రాయేలు ప్రజ యెషయా పేర్కొన్న బాధామయ సేవకుణ్ణి, క్రీస్తునీ సూచిస్తుంది.

ఈ పాట నేటి మన శ్రమలకుకూడ చిహ్నంగా ఉంటుంది. మెస్సియాలాగే అతని శిష్యులు కూడ తమ సిలువను చేకొని బాధామయమార్గంలో నడవాలి.

2. విభజనం

ఈ గేయంలో రెండు భాగాలున్నాయి. 1–21 చరణాలు విలాపగీతం. ఇది మొదటిభాగం. దీనిలో భక్తుడు తన శ్రమను చెప్పకొన్నాడు. రెండవభాగం - 22-31 చరణాలు. ఇది కృతజ్ఞతా వందనం, ప్రభువు తన మొర నాలించి తన బాధలను తొలగించినందులకు భక్తుడు ఈ రెండవ భాగంలో దేవునికి వందనాలర్పించాడు. ఈ రెండిటినీ అతడు మొదట వేరువేరు భాగాలుగా రచించి ఉండవచ్చు. తర్వాత అవి ఏకకీర్తనంగా కలిసిపోయి ఉండవచ్చు.

3. వివరణం

మొదటి భాగం

1-2 కీర్తనకారుని బాధలు రెండు. ప్రభువు తన్నుచేయి విడచాడు. అతడు తన మొర వినడంలేదు. ఈ చరణాల్లోని మొదటి వాక్యాన్ని ప్రభువు సిలువమీద ప్రార్థించాడు.

3-5. దేవుడు దేవళంలో మందసం మీద ఆసీనుడై యుంటాడు. ఆలాగే •అతడు దేవళంలో భక్తుల స్తుతులమీద గూడ ఆసీనుడై యుంటాడు. అతడు పరమపవిత్రుడు. పాపపు నరులు అతన్ని సమీపించలేరు.