పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6-7 గొట్టెలు ఎడ్లు వన్యమృగములు
                  ఆకాశమునందలి పక్షులు సముద్రమునందలి చేపలు
                  సాగరమునందలి జలజంతువులు మొదలుకొని
                  నీవు చేసిన సృష్టికంతటికిని అతనిని అధిపతిని గావించితివి
                  సమస్తము అతని పాదములక్రింద నుంచితివి

8 మా దేవుడవైన ప్రభూ!
               నీ మహత్త్వము భూమియందంతట చూపట్టుచున్నది.

1. పరిచయం

ఇది స్తుతికీర్తనల వర్గానికి చెందింది. ఈ వర్గం కీర్తనలు భగవంతుణ్ణిస్తుతించి కీర్తిస్తాయి. ఈ గేయం విశేషంగా దేవుని సృష్టిమహిమనూ, నరుని ఘనతనూ ప్రశంసిస్తుంది. దేవుడు నరుడ్డి సృష్టికంతటికీ రాజనీ, నేలమీద తన ప్రతినిధినీ చేసాడని చెప్తుంది. ఈ కీర్తనంద్వారా మన గొప్పతనాన్ని మనమే గుర్తించవచ్చు. రేయి ఆకాశంవైపుజూచి పులకించిపోయిన కీర్తనకారుల్లాగ, మనంకూడ ప్రకృతిని ధ్యానించుకోవడం నేర్చుకోవచ్చు.

2. విభజనం

1-2 సృష్టికర్తయైన దేవుడు
3=8 నరుని ఘనత
9 ప్రారంభవాక్యాలు పునశ్చరణం

3. వివరణం

1-2. ఈ తొలి రెండుచరణాల్లో కీర్తనకారుడు ప్రభువు సృజనశక్తిని కొనియాడుతూన్నాడు. ఇక్కడ ప్రభువు మహత్త్వమంటే అతనిసృజనశక్తి, అతని సృజనశక్తి భూమి యందంతటా, అనగా లోకమందంతటా గోచరిస్తుంది. లోకంలో ప్రతి వస్తువూ భగవంతుడు చేసిందే గదా! “నీ మాహాత్మ్యం ఆకాశం వరకూ కీర్తింపబడుతుంది" అంటే సూర్యచంద్ర నక్షత్రాదులు ఆకాశంలో దేవుణ్ణి స్తుతిస్తాయని భావం.

ఇక్కడ, రెండవచరణం హీబ్రూ మూలంలో భ్రష్టమైపోయింది. కనుక దాని యర్థమేమిటో ఎవరికీ రూఢిగా తెలియదు. అనువాదకులు దాన్ని భిన్నభిన్నంగా అనువదిస్తూంటారు. మనం దాన్ని వదలివేయడం మేలు.